77 మంది సర్పంచులు మా మద్దతుదారులే..
రాజోళి: అలంపూర్ నియోజకవర్గంలో కనీవినీ ఎరుగని గెలుపును కాంగ్రెస్ మద్దతుదారులు సాధించి, చరిత్ర సృష్టించారని.. 124 గ్రామ పంచాయతీల్లో 77 మంది కాంగ్రెస్ మద్దతుదారులే గెలిచారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ అన్నారు. శాంతినగర్ క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేఽశంలో మాట్లాడారు. అలంపూర్ నియోజకవర్గంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కుట్రలు, కుతంత్రాలతో తనను ఓడించినా, ప్రజలు మాత్రం సర్పంచు ఎన్నికల్లో తమ అభిమానాన్ని చూపి కాంగ్రెస్ మద్దతుదారులకే పట్టం కట్టారన్నారు. 77 మంది కాంగ్రెస్ మద్దతుదారులే గెలిచారని, కాని బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు తమ పార్టీ తరపున గెలిచారని అసత్య ప్రచారాలు చేసుకుంటున్నారని అన్నారు. తమ మద్దతుతో ఏకగ్రీవమైన సర్పంచు స్థానాలను స్వతంత్య్ర అభ్యర్థులుగా చెప్పడం, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారిని కూడా తమ మద్దతుదారులని చెప్పుకుంటూ, పబ్బం గడుపుతున్నారని అన్నారు. గెలిచిన వారందరూ తమ పార్టీ కండువా కప్పుకుంటుంటే చూసి కూడా తమ ఖాతాలో గెలిచిన వారని చెప్పడం చూస్తే వారి పార్టీపై వారికి ఎంత నమ్మకం ఉందో అర్ధమవుతుందని అన్నారు. రేవంత్‌రెడ్డి సీఎంగా ప్రజలకు అందుతున్న సంక్షేమ ఫలాలు ప్రజలను కాంగ్రెస్ వైపు నడిపించాయని అన్నారు. నియోజకవర్గానికి బీఆర్‌ఎస్ పార్టీ తరపున, ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి ఏదీ లేదని అన్నారు. వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించిన ఘనత తమదేనన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ఖాతాలో మరిన్ని విజయాలు నమోదవుతాయని, బీఆర్‌ఎస్ పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ఆయన అన్నారు. కార్యక్రమంలో షేక్షావళి,జగన్‌గౌడ్,గంగి రెడ్డి,కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,గెలిచిన సర్పంచులు పాల్గొన్నారు.


