 
															ఉపాధ్యాయులకు సాంకేతిక పరిజ్ఞానం అవసరం
గద్వాలటౌన్: మారుతున్న కాలానుగుణంగా ఉపాధ్యాయులు సాంకేతికపై అవగాహన పెంచుకుని, విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేలా పాఠ్యాంశాలను బోధించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. బుధవారం స్థానిక బాలభవన్‌లో విద్యాశాఖకు సంబంధించిన పలు యాప్‌లు, వివిధ పోర్టర్ల గురించి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. ఏఐతో పాటు ఇతర టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ప్రతి ఒక్కరూ ముందుండాలన్నారు. ఆ లక్ష్యంతోనే ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దెందుకు ఉపాధ్యాయులు ప్రయోగపూర్వకంగా అర్థమయ్యే రీతిలో బోధించాలన్నారు. ఈ ఏడాది పది పరీక్షలలో మన జిల్లా మెరుగైన స్థానాన్ని సాధించాలని సూచించారు. ఇప్పటికే తాను అనేక విద్యా సంస్థలను పరిశీలించానని, చాలామంది విద్యార్థుల నైపుణ్యాలు ఆశించిన స్థాయిలో లేవని ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందో పరిశీలించేందుకు ప్రతి జిల్లా నుంచి ముగ్గురు ఉపాధ్యాయులను ఎంపిక చేసి త్వరలోనే విదేశాలకు పంపుతున్నట్లు వివరించారు. విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించడమే కాకుండా వివిధ విద్యా శాఖ కార్యక్రమాలలో ఉపాధ్యాయులు భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించే ఉపాధ్యాయులను ఉపేక్షించేది లేదని, శాఖ పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం జీహెచ్‌ఎం అసోసియేషన్ ఆధ్వర్యంలో ముద్రించిన హెచ్‌ఎంల పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ విజయలక్ష్మి, సెక్టోరియల్ అధికారులు శాంతిరాజు, హంపయ్య, ఎంఈఓలు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
