
45వేల గన్నీ బ్యాగుల సరఫరా
గట్టు: ఎట్టకేలకు గట్టు మండలానికి 45 వేల గన్నీ బ్యాగులను అధికారులు సోమవారం సరఫరా చేశారు. గన్నీ బ్యాగుల కొరత కారణంగా ధాన్యం సేకరణ నత్తనడకన సాగుతున్న వ్యవహారంపై ‘పేరుకుపోయిన ధాన్యం’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమవగా అధికారులు స్పందించారు. గన్నీ బ్యాగులను సమకూర్చారు. వీటిని ఆయా కొనుగోలు కేంద్రాలకు సరఫరా చేశారు. గట్టుకు 15వేలు, మాచర్లకు 10వేలు, ఆలూరుకు 10వేలు, పెంచికలపాడుకు 10 వేల గన్నీ బ్యాగులను తీసుక వచ్చి రైతులకు అందజేసినట్లు పీఏసీఎస్ చైర్మన్ వెంకటేష్, సీఈఓ భీమేష్ తెలిపారు. గన్నీ బ్యాగుల కోసం కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు బారులు తీరారు. ఇప్పటికే వడ్ల రాసులతో కొనుగోలు కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. వడ్లను ఎప్పుడు తూకం పడతారా అని రైతులు ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు అధికారులు గన్నీ బ్యాగులను కొనుగోలు కేంద్రాలకు సరఫరా చేయడంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గన్నీ బ్యాగుల కొరత కారణంగానే వడ్ల తూకం ఆగిపోయిందని, ధాన్యం మిల్లులకు తరలిస్తే ఏ ఇబ్బంది ఉండదని రైతులు తెలిపారు. గన్నీ బ్యాగుల కొరతను తీర్చిన అధికారులు.. ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా మిల్లులకు తరలించే ఏర్పాట్లు కూడా చేయాలని రైతులు కోరారు.

45వేల గన్నీ బ్యాగుల సరఫరా