
సాగులో ఆధునిక పద్ధతులు పాటించాలి
కేటీదొడ్డి: రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించి లాభాలు పొందాలని జిల్లా వ్యవసాయాధికారి సక్రియానాయక్ అన్నారు. శుక్రవారం మండలంలోని కుచినెర్ల గ్రామ రైతువేదికలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ పరిశోధన పాలెం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించే పంటల సాగుపై దృష్టిసారించాలన్నారు. సేంద్రియ ఎరువులు, రసాయనాల వినియోగం, సాగునీటి ఆదా, మట్టి పరీక్షలు, వర్షాధార వ్యవసాయంలో నీటిని సంరక్షించే చర్యలు, పంట మార్పిడితో కలిగే ప్రయోజనాలు, చెట్ల పెంపకంతో కలిగే లాభాలు, యూరియా వాడకాన్ని సరైన మోతాదులో వాడాలని, రసాయనాలను తగు మోతాదులో వాడాలని, రైతులు షాపులలో కొన్న విత్తనం పురుగు, తెగుళ్లు కలుపు మందులకు రశీదు భద్రపరుచుకోవాలన్నారు. ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు ఉపయోగపడతాయని తెలిపారు. ఆయిల్‌పాం తోటల సాగు, యాజమాన్య పద్ధతుల్లో మెలకువలు వివరించారు. అనంతరం రైతు ముంగిట్లో కరపత్రం విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ చంద్రశేఖర్, మాజీ వైస్ ఎంపీపీ రామకృష్ణనాయుడు, మండల వ్యవసాయాధికారి సాజిద్ రెహమాన్, ఏఈఓలు ప్రియాంక, కిరణ్‌కుమార్, మమత, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
1,105 క్వింటాళ్ల
వేరుశనగ రాక
గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు శుక్రవారం 1,105 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చింది. కాగా క్వింటాల్ గరిష్టంగా రూ.6,200, కనిష్టంగా రూ.3,700, సరాసరిగా రూ.5,200 చొప్పున పలికింది. అలాగే 64 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టంగా రూ.5,812, కనిష్టంగా రూ.3,680, సరాసరిగా రూ.5,812, 4 క్వింటాళ్ల కంది రాగా గరిష్టంగా రూ.6,066, కనిష్టంగా రూ.4,689, సరాసరిగా రూ.4,899, 646 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టంగా రూ.1,876, కనిష్టంగా రూ.1,550, సరాసరిగా రూ.1,766 ధరలు లభించాయి.
డిగ్రీ ఫలితాలు విడుదల
బిజినేపల్లి: మండలంలోని పాలెం అటానమస్ డిగ్రీ కళాశాల రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ రాములు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండో సెమిస్టర్‌లో 43 శాతం ఉత్తీర్ణత సాధించారని, విద్యార్థులు తమ ఫలితాలను కళాశాల వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు. మార్కుల పునఃమూల్యాంకనం కోసం ఈ నెల 17 వరకు తమ దరఖాస్తులను కళాశాలలో సమర్పించాలన్నారు. ఫలితాలను పాలమూరు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ రమేష్‌బాబు, ఎగ్జామినేషన్ కంట్రోలర్ రాజ్‌కుమార్, అడిషనల్ కంట్రోలర్ శాంతిప్రియ, అనురాధరెడ్డి విడుదల చేయగా.. కళాశాల అడిషనల్ కంట్రోలర్ శివ, సిబ్బంది శ్రీనివాస్, నాగరాజు, సుష్మ, వెంకటేష్, యాదగిరి, కవిత తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీలో
కండక్టర్ల బదిలీలు
స్టేషన్ మహబూబ్‌నగర్: ఉమ్మడి జిల్లాలోని పది ఆర్టీసీ (రీజియన్) డిపోల్లో పనిచేస్తున్న 89 మంది కండక్టర్లకు వారి అభ్యర్థన మేరకు బదిలీలు జరిగాయి. ఈ సందర్భంగా ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలు చేపట్టి 80 మంది అభ్యర్థులకు కండక్టర్లుగా వివిధ డిపోల్లో పోస్టింగులు ఇచ్చామని, అలాగే 89 మంది రెగ్యులర్ కండక్టర్లకు వారి అభ్యర్థన మేరకు బదిలీలు చేశామని ఆర్‌ఎం తెలిపారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తమ బదిలీలను చేపట్టినందుకు కండక్టర్లు సంతోషం వ్యక్తం చేశారు. ఆర్‌ఎంకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

సాగులో ఆధునిక పద్ధతులు పాటించాలి