
మాట్లాడుతున్న ఆర్డీఓ రాములు,పక్కన ఈఈ రహీముద్దీన్
గద్వాల రూరల్: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న చిన్నోనిపల్లి రిజర్వాయర్ పనులను పూర్తి చేసేందుకు గ్రామస్తులు సహకరించాలని ఆర్డీఓ రాములు కోరారు. శనివారం ఆయన తన కార్యాలయంలో నెట్టెంపాడు ఈఈ రహీముద్దీన్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. కోర్టు ఆదేశాల ప్రకారం 2018లోనే రైతులకు రూ.14,82,39,350 నష్టపరిహారం చెల్లించినట్లు చెప్పారు. ఇచ్చిన నష్టపరిహారం సరిపోదంటూ రైతులు కోర్టుకు వెళ్లారని, కోర్టు ఆదేశాల మేరకు రెండుసార్లు నష్టపరిహారాన్ని పెంచి రైతులకు ఇవ్వడం జరిగిందన్నారు. అనంతరం ఈఈ రహీముద్దీన్ మాట్లాడుతూ రిజర్వాయర్ పనులు 90 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పదిశాతం పనులు పూర్తి చేసేందుకు సంబంధిత రైతులు సహకారం అందించాలన్నారు. రిజర్వాయర్‌ను సంప్లిమెంటేషన్‌గా ఏర్పాటు చేశామని, దీని ద్వారా నెట్టెంపాడు, ఆర్డీఎస్ పథకాల కింద ఉన్న ఆయకట్టుకు సాగునీరు అందుతుందని చెప్పారు. ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు నీరందించేందుకు తుమ్మిళ్ల ఎత్తిపోతలను నిర్మించామని, దాని ద్వారా చివరి ఆయకట్టుకు నీరందకుంటే చిన్నోనిపల్లి రిజర్వాయర్ ద్వారా 25వ డిస్ట్రిబ్యూటరీ నుంచి ఆర్డీఎస్ ఆయకట్టుకు నీరందిస్తామన్నారు.