
మల్దకల్: మండలంలోని పాల్వాయిలో శుక్రవారం శ్రీసిద్ధి ఆంజనేయస్వామి ఆలయ పునర్ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనను వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు ధ్వజస్తంభంతో పాటు, నూతన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతిష్ఠాపన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది.
సద్దలోనిపల్లిలో..
మండలంలోని సద్దలోనిపల్లిలో శుక్రవారం కృష్ణస్వామి ఆలయ శిఖర, బొడ్రాయి ప్రతిష్ఠాపనను వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు సత్యప్రమోదచార్యులు, శ్రీపతి, శ్రావణ్‌కుమార్, పాండురంగాస్వామి బొడ్రాయికి ప్రత్యేక పూజలు చేసి ప్రతిష్ఠాపన చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సర్పంచ్ అశోక్ ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. పాల్వాయి, సద్దలోనిపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రతిష్ఠాపన కార్యక్రమానికి జెడ్పీ చైర్‌పర్సన్ సరిత, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి వేర్వేరుగా ఆలయాలకు చేరుకుని ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ జంబురామన్‌గౌడ్, ఎంపీపీ రాజారెడ్డి, జెడ్పీటీసీలు ప్రభాకర్‌రెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు తిమ్మారెడ్డి, శివరామిరెడ్డి, అశోక్, పెద్దవీరన్న, వెంకటన్న తదితరులు పాల్గొన్నారు.
జోగుళాంబ సన్నిధిలో మానికానందన్ మహారాజ్
జోగుళాంబ శక్తిపీఠం: అష్టాదశ శక్తిపీఠాల్లో అయిదో శక్తిపీఠమైన అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయాలను శుక్రవారం మానికానందన్ మహారాజ్ దర్శించుకున్నారు. స్వామివారు తమిళనాడులోని తిరుచ్చి నుంచి వచ్చినట్టు ఆలయ జూనియర్ అసిస్టెంట్ చంద్రయ్య ఆచారి తెలిపారు. అఘోర పరంపరలో భాగమైన ఈ స్వాముల వారు ఇక్కడి శక్తిపీఠాన్ని దర్శించుకునేందుకు రాగా.. దేవస్థానం తరఫున వారికి తగు గౌరవమర్యాదలు అందించి, ఆలయ విశిష్టతను వివరించారు.
దరఖాస్తులకుగడువు పొడిగింపు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: తెలంగాణ గురుకులాల్లో ఐదో తరగతిలో చేరేందుకు నిర్వహించనున్న ప్రవేశ పరీక్ష దరఖాస్తుల గడువును ఈనెల 20వ తేదీ వరకు పెంచినట్టు టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ ప్రాంతీయ సమన్వయ అధికారి కె.నాగార్జునరావు, రంగారెడ్డిగూడెంలోని జూనియర్ కాలేజీ(బాలికల) ప్రిన్సిపాల్ వాణిశ్రీ వేర్వేరు ప్రకటనలలో తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ప్రవేశ పరీక్ష వచ్చే నెల 23న నిర్వహించనున్నామన్నారు. ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. పూర్తి వివరాలను https://tscet.cgg.gov.in లేదా https://tswgurukulam.telangana.gov.in వెబ్‌సైట్‌లలో చూడవచ్చని తెలిపారు.
నేడు ప్రత్యేక
బ్యాంకు లోక్ అదాలత్
పాలమూరు: బ్యాంకులలో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారం కోసం శనివారం ప్రత్యేక బ్యాంకు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ప్రేమావతి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక బ్యాంకు లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బ్యాంకు నిర్వాహకులతో పాటు కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు సంబంధించి 779 కేసులలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
