ధాన్యం లారీలకు జీపీఎస్‌ | - | Sakshi
Sakshi News home page

ధాన్యం లారీలకు జీపీఎస్‌

May 13 2026 1:20 AM | Updated on May 13 2026 1:20 AM

వాహనాల కదలికలపై నిత్యం పర్యవేక్షణ

మిల్లుల్లో అన్‌లోడింగ్‌ జాప్యానికి చెక్‌

నూతన పద్ధతిలోనే కేటాయింపులు

రైతులకు త్వరగా డబ్బులు చెల్లించే అవకాశం

భూపాలపల్లి రూరల్‌: మిల్లులకు సమానంగా ధాన్యం కేటాయింపులు, పంపిన ధాన్యాన్ని అన్‌లోడ్‌ చేయడంలో జాప్యాన్ని నియంత్రించేందుకు అధికా రులు జీపీఎస్‌ (గ్లోబల్‌ పోజిషనింగ్‌ సిస్టమ్‌) ట్రాకింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ సీజన్‌లో ధాన్యం కొనుగోలులో ట్రక్‌ షీట్‌ జనరేట్‌తోపాటు ఆన్‌లైన్‌లోనే మిల్లులకు కేటాయింపులను ప్రారంభించారు. తరుగు పేరుతో దోపిడీని అరికట్టనున్నారు. డబ్బుల చెల్లింపులు వేగిరం చేయనున్నారు.

జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు పౌరసరఫరాల శాఖ నూతన పద్ధతులను అమలు చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 95,590 ఎకరాల్లో వరి సాగు కాగా 1.60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని జిల్లా వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 185 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు వేసి కొనుగోళ్లు ప్రారంభించారు. ఇప్పటివరకు 12 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.3 కోట్ల చెల్లింపులు చేశారు.

అక్రమాలను అరికట్టేందుకే..

ధాన్యం రవాణాలో అక్రమాలను అరికట్టేందుకు జీపీఎస్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. తరుగు ఎక్కువగా తీయాలని మిల్లర్లు రోజుల తరబడి వాహనాల నుంచి ధాన్యం అన్‌లోడ్‌ చేయకుండా ఉంచేవారు. ధాన్యం తరుగును తీసేందుకు అంగీకరిస్తేనే దించుకునేవారు. జీపీఎస్‌ ఏర్పాటు చేయడంతో ఎంత సమయం వేచి ఉంది, ఎందుకు వేయిటింగ్‌ చేయించారనే వివరాలు తీసుకోనున్నారు. కావాలని ఆలస్యం చేస్తే మిల్లర్లపై చర్యలు తీసుకుంటారు. అక్రమాలను చెక్‌ పెట్టేందుకు లారీలు, డీసీఎం వాహనాలకు జీపీఎస్‌ ట్రాకింగ్‌ పరికరాలు అమర్చడం తప్పనిసరి చేశారు. జీపీఎస్‌ సరిగా పనిచేస్తున్న వాహనాలకు మాత్రమే లోడింగ్‌ చేయనున్నారు. వాహనాల కదలికలను నిత్యం పర్యవేక్షించనున్నారు. ఇలా ఆన్‌లైన్‌లో ట్రక్‌ షీట్లు జనరేట్‌ చేయడం, వాహనాలకు జీపీఎస్‌ ఏర్పాటుతో రైతులకు మేలు జరగనుంది. తరుగు పేరుతో దోపిడీకి పాల్పడే అవకాశాలు తగ్గిపోనున్నాయి. రైతులకు 48 గంటల్లో ధాన్యం డబ్బులు జమకానున్నాయి..

‘పలుకుబడి’కి ఇక చెల్లు

ఇదివరకు సివిల్‌ సప్లయీస్‌ అధికారులు, స్థానిక అధికారులకు నచ్చిన మిల్లులకు, పలుకుబడి ఉన్న నేతల మిల్లులకు అధికంగా ధాన్యం కేటాయించేవారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో మిల్లుల యజమానుల నుంచి ఫిర్యాదులు, అధిక తరుగు, మిల్లుల వద్ద లారీలు పడిగాపులకు, అక్రమాలకు చెక్‌ పడనుంది. నాణ్యతలేదనే పేరుతో కోతలు, ట్రక్‌ షీట్లలో అవకతవకలకు పాల్పడే అవకాశాలు ఉండవు. కొనుగోలు కేంద్రాల్లో లారీ లోడ్‌ చేసిన వెంటనే ఆన్‌లైన్‌ ట్రక్‌ జనరేట్‌ చేసి, సంబంధిత మిల్లును ఆటోమేటిక్‌గా కేటాయించే విధానాన్ని అమలు చేస్తుంది. మాన్యువల్‌గా మిల్లుల కేటాయింపు విధానాన్ని నిలిపేసింది. కొత్త విధానంతో లారీ లోడ్‌ చేసే సమయానికి మిల్లు వివరాలు తెలియవు. ట్రక్‌ షీట్‌ ఆన్‌లైన్‌లో జనరేట్‌ రేట్‌ చేసిన తర్వాతనే ఆటోమేటిక్‌గా ఏ మిల్లుకు తరలించాలో సూచిస్తుంది. ట్రక్‌ షీట్‌లో పేర్కొన్న మిల్లుకే ధాన్యాన్ని తరలించాల్సి ఉంటుంది.

పారదర్శకత కోసమే..

మిల్లర్లకు ధాన్యం కేటాయింపుల్లో పారదర్శకత, త్వరగా రైతులకు డబ్బులు చెల్లింపులు జరగనున్నాయి. తరుగు పేరుతో ఇక మిల్లర్ల ఇబ్బందులు ఉండవు. వాహనాలకు సైతం జీపీఎస్‌ ఏర్పాటు చేశాం. దీంతో మిల్లర్లు అన్‌లోడింగ్‌ జాప్యం తగ్గనుంది. దీంతో రైతులకు మేలు జరగనుంది. అకాల వర్షానికి తడిచిన 612 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి నేరుగా మిల్లులకు తరలించాం.

– రాములు, డీఎం సివిల్‌ సప్లయీస్‌ అధికారి

Advertisement
 
Advertisement
Advertisement