మొగుళ్లపల్లి/రేగొండ: జిల్లాలో మొక్కజొన్న కొనుగోళ్లు సజావుగా సాగుతుందని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. మంగళవారం మొగుళ్లపల్లి, రేగొండ మండలకేంద్రాల్లోని మక్కల కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ కమిటీ గోదాములోని నిల్వ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 49,528 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారని, ప్రభుత్వం క్వింటాకు రూ.2,400 కనీస మద్దతు ధర ప్రకటించిందన్నారు. జిల్లాలో 12 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇప్పటివరకు 26,000 మెట్రిక్ టన్నుల మక్కలు కొనుగోలు కేంద్రాలకు చేరుకోగా, అందులో 16,850 మెట్రిక్ టన్నులు పూర్తయ్యిందన్నారు. ఇంకా సుమారు 9,500 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. గోదాముల కొరత కారణంగా నిల్వ సమస్యలు ఉన్నాయని, హమాలీలకు చెల్లించే కూలి రేట్లు తక్కువగా ఉండటంతో కార్మికుల లభ్యతతో ఇబ్బందులు ఉన్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పటికీ రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, సహకార అధికారి వాలియా నాయక్, వ్యవసాయ అధికారి బాబురావు, తహసీల్దార్ సునీత, ఎంపీడీఓ సురేందర్, అబ్దుల్ రజాక్, వాసుదేవారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతుల వివరాలను సక్రమంగా నమోదు చేయాలి
ధాన్యం విక్రయించిన రైతుల వివరాలను సక్రమంగా నమోదు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని మొట్లపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రిజిస్టర్లను పరిశీలించి నమోదు ప్రక్రియ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కలెక్టర్ రాహుల్‌శర్మ
మక్కలు నిల్వ చేసే గోదామును పరిశీలిస్తున్న కలెక్టర్ రాహుల్ శర్మ


