ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారమే లక్ష్యం

May 12 2026 5:30 AM | Updated on May 12 2026 5:30 AM

భూపాలపల్లి అర్బన్‌: ప్రజలు అందించిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ ఆదేశించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివస్‌ కార్యక్రమంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వచ్చిన 20 ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ, సమస్యలను శ్రద్ధగా విని వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తక్షణ సూచనలు చేశారు. ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తూ సంబంధిత పోలీస్‌స్టేషన్ల సీఐలు, ఎస్‌ఐలతో నేరుగా మాట్లాడి అవసరమైన దిశానిర్దేశం చేశారు. ప్రజలు పైరవీలు, మూడో వ్యక్తుల ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీస్‌ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చట్టబద్ధమైన విధానంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని, శాంతిభద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత చేరువగా ఉండడమే పోలీస్‌ శాఖ లక్ష్యమని తెలిపారు. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజాదివస్‌ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి, సంబంధిత అధికారుల సహకారంతో వాటిని పరిష్కరిస్తున్నామన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా పోలీస్‌ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు.

పోలీసుల సంక్షేమానికి మరో ముందడుగు

జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు సిబ్బంది సౌకర్యార్థం ఏర్పాటు చేసిన సెలూన్‌ను ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ సోమవారం ప్రారంభించారు. విధి నిర్వహణలో ఎప్పుడూ బిజీగా ఉండే పోలీసులకు కార్యాలయ పరిసరాల్లోనే ఈ సౌకర్యం అందుబాటులో ఉండటం వల్ల సమయం ఆదా అవుతుందని ఎస్పీ తెలిపారు. పోలీసుల సంక్షేమం, వారి అవసరాలపై జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. భవిష్యత్‌లో కూడా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ నరేష్‌ కుమార్‌, వెల్ఫేర్‌ ఆర్‌ఐ సంతోష్‌ కుమార్‌, ఎంటీఓ ఆర్‌ఐ పూర్ణచందర్‌ పాల్గొన్నారు.

ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌

Advertisement
 
Advertisement
Advertisement