పాలిసెట్‌కు ఏర్పాట్లు పూర్తి | - | Sakshi
Sakshi News home page

పాలిసెట్‌కు ఏర్పాట్లు పూర్తి

May 12 2026 5:30 AM | Updated on May 12 2026 5:30 AM

భూపాలపల్లి అర్బన్‌: పాలిసెట్‌ పరీక్షకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సమన్వయ అధికారి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎ.రమణారావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా నాలుగు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు, మొత్తం 905 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు వెల్లడించారు. ఈ నెల 13న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఉదయం 10 గంటలలోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఆలస్యంగా వచ్చిన వారికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. విద్యార్థులు తప్పనిసరిగా హాల్‌ టికెట్‌తో పాటు హెచ్‌బీ పెన్సిల్‌, బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్‌ తీసుకురావాలని సూచించారు. ఎలక్ట్రానిక్‌ పరికరాలను పరీక్ష హాల్‌లోకి అనుమతించబోమని తెలిపారు.

ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

భూపాలపల్లి అర్బన్‌: ప్రభుత్వ ఐటీఐ/ఏటీసీలో 2026–27, 2027–28 విద్యా సంవత్సరాలకు వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్‌ జుమ్లానాయక్‌ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు ఐటీఐ తెలంగాణ వెబ్‌సైట్‌ ద్వారా జూన్‌ 8 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రవేశాలకు సంబంధించి 10వ తరగతి ఉత్తీర్ణత అర్హతగా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప్రవేశాల్లో ఫిట్టర్‌, మ్యానుఫాక్చరింగ్‌ ప్రాసెస్‌ కంట్రోల్‌ అండ్‌ ఆటోమేషన్‌, ఇండస్ట్రియల్‌ రోబోటిక్స్‌ అండ్‌ డిజిటల్‌ మ్యానుఫాక్చరింగ్‌ టెక్నీషియన్‌, ఇంజనీరింగ్‌ డిజైన్‌ టెక్నీషియన్‌, వర్చువల్‌ అనాలిస్ట్‌ డిజైనర్‌–ఎఫ్‌ఈఎం, సీఎన్‌సీ మిషనింగ్‌ టెక్నీషియన్‌, మెకానిక్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పూర్తి వివరాలకు ఐటీఐ భూపాలపల్లి కార్యాలయం, సెల్‌ నంబర్‌ 85004 65034ను సంప్రదించాలని సూచించారు.

డీఆర్వోను కలిసిన ట్రెస్మా ప్రతినిధులు

భూపాలపల్లి రూరల్‌: జిల్లాకు నూతనంగా వచ్చిన జిల్లా రెవెన్యూ అధికారి వసంత కుమారిని సోమవారం ట్రెస్సా జిల్లా ప్రతినిధి బృందం మర్యాద పూర్వకంగా కలిసింది. కలిసిన వారిలో ట్రెస్సా జిల్లా అధ్యక్షుడు మార్క రామ్మోహన్‌, ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ రజాక్‌, ట్రెజరర్‌ పకిడే రాజయ్య ఉన్నారు.

మ్యూజియంలోకి పురాతన విగ్రహాలు

కాళేశ్వరం: కాళేశ్వరంలో ఈనెల 21నుంచి జూన్‌1వ తేదీ వరకు జరుగనున్న సరస్వతీనది అంత్యపుష్కరాలకు ముందుగానే మ్యూజి యం ప్రారంభించాలనే ఉన్నతాధికారుల ఆదేశాలతో నిర్మాణం పూర్తికాక ముందే హడావుడిగా పురాతన విగ్రహాలను అమర్చుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం అధికారులు పురాతన విగ్రహాలను మ్యూజియంలో అమర్చారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు కాకతీయులు, చాళుక్యులనాటి ప్రాంతీయ చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపడుతున్నప్పటికీ పూర్తిస్థాయి పనులు కాకముందే విగ్రహాల ఏర్పాటు చేపట్టడంపై స్థానికుల్లో చర్చ జరుగుతోంది.

ఏరియా బీసీ, ఓబీసీ లైజనింగ్‌ ఆఫీసర్‌గా మురళీమోహన్‌

భూపాలపల్లి అర్బన్‌: భూపాలపల్లి ఏరియా సింగరేణి బీసీ, ఓబీసీ లైజనింగ్‌ ఆఫీసర్‌గా ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్‌ సిలివేరి మురళీమోహన్‌ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం జీఎం కార్యాలయ చాంబర్‌లో సింగరేణి బీసీ ఓబీసీ జనరల్‌ సెక్రటరీ నల్లపురి రమేష్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ ఏరియాల లైజనింగ్‌ ఆఫీసర్లు, నాయకులు పాల్గొని భూపాలపల్లి ఏరియా జనరల్‌ మేనేజర్‌ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఏరియా జనరల్‌ మేనేజర్‌ లైజనింగ్‌ ఆఫీసర్‌గా నియమితులైన మురళీమోహన్‌ను అభినందిస్తూ శాలువాతో సన్మానించారు.

Advertisement
 
Advertisement
Advertisement