అన్నదాతల్లో ఆందోళన | - | Sakshi
Sakshi News home page

అన్నదాతల్లో ఆందోళన

May 11 2026 7:26 AM | Updated on May 11 2026 7:26 AM

భూపాలపల్లి: ఆకాశంలో మబ్బులు ఉరుములు అన్నదాతలకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చి, కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో అకాల వర్షాలు కురిస్తే పంటంతా నీటి పాలవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆశించిన స్థాయిలో దిగుబడి

ఈ ఏడాది యాసంగిలో మొక్కజొన్న, వరిపంట ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చింది. జిల్లాలోని 12 మండలాల్లో 29వేలకు పైగా ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేయగా, 39,500 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వచ్చిందని అంచనా. 12 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తున్నారు. వరి 95,590 ఎకరాల్లో సాగు చేయగా, సుమారు 1.60 లక్షల మెట్రిక్‌ టన్నులు దిగుబడి వచ్చింది. జిల్లావ్యాప్తంగా 185 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావించి ఇప్పటి వరకు 165 కేంద్రాలను ప్రారంభించారు.

జిల్లాకు వర్ష సూచనలు

రైతులు పండించిన ధాన్యం ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు తరలించగా, మొక్కజొన్న సగానికి పైగా కేంద్రాలకు వచ్చింది. సుమారు 15వేల ఎకరాల మొక్కజొన్న పంట ఇంకా కల్లాల్లోనే ఉంది. కంకి ఇరవడం, యంత్రాలతో కంకి పట్టించడం తదితర పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే జిల్లాకు వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నెల 6వ తేదీ బుధవారం రోజున భూపాలపల్లి, మల్హర్‌, మహదేవపూర్‌, మహాముత్తారం మండలాల్లో మోస్తారు వర్షం కురిసి కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు తడిశాయి. కొత్తపల్లిగోరి మండలంలో చిరు జల్లులు కురవగా పంట నష్టం ఏమీ జరగలేదు. దీంతో అక్కడి రైతులు ఊపిరి పీల్చుకున్నారు. రెండు రోజులుగా సాయంత్రం వేళల్లో మబ్బులు ఉరుముతూ వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట చేతికొచ్చాక, అకాల వర్షం పడితే పంట తీవ్రంగా దెబ్బతింటుందని, కొనేవారే కరువవుతారని ఆవేదన చెందుతున్నారు. రైతులు ప్రతీరోజు రాత్రి కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి ధాన్యంపై పరదాలు కప్పి, తెల్లవారుజామున తొలగిస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండటం మూలంగానే ఈ పరిస్థితి ఎదురవుతుందని రైతులు వాపోతున్నారు.

మబ్బులను చూస్తే భయమేస్తోంది..

నాకున్న 8 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసిన. వచ్చిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన. వారం రోజులైతాంది. ఇంకా కాంటా పెట్టలేదు. మబ్బులను చూస్తే భయమైతాంది. వర్షం కురిస్తే మాత్రం ధాన్యం మొత్తం దెబ్బతింటది. ప్రతీరోజు రాత్రి ధాన్యం మీద పరదాలు కప్పి పొద్దన తీసేస్తాన. వర్షం బాగా వస్తే పరదాలు కూడా పని చేయవు. జొన్నలు మొత్తం తడిసి ముద్దయితవి.

– నీరటి నారాయణ, రైతు, చిట్యాల

ఉరుముతున్న మబ్బులు, చిరు జల్లులు

కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లోనే

మొక్కజొన్న, ధాన్యం

మోస్త్తరు వానలు ఉన్నాయంటున్న వాతావరణ శాఖ

కురిస్తే మొక్కజొన్న, ధాన్యం నీటిపాలే..

వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు..

ఓవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు నత్తనడకన సాగడం, మరోవైపు ప్రతీరోజు వర్ష సూచనలు కనిపిస్తుండటంతో పంట నీటి పాలు కాకూడదనే ఉద్దేశంతో కొందరు రైతులు పరకాల, వరంగల్‌ పట్టణాలకు ధాన్యాన్ని తరలించి ప్రైవేట్‌ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఇదే అదనుగా భా వించిన వ్యాపారులు మొక్కజొన్నను క్వింటాలుకు రూ.1,900కు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం చెల్లిస్తున్న ధరతో పోలిస్తే రైతులు ఒక క్వింటాకు రూ. 500 చొప్పున నష్టపోవాల్సి వస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement