అనంతలక్ష్మి ఆయుర్వేద వైద్య కళాశాలలో బీఏఎంఎస్ సీట్ల భర్తీపై అయోమయం
కాశిబుగ్గ: వరంగల్‌లోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో పేరుకుపోయిన సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతి సంవత్సరం యూజీ అడ్మిషన్ల సమయంలో బీఏఎంఎస్ సీట్ల భర్తీపై అయోమయం నెలకొంటుంది. సరిపడా సిబ్బంది, సౌకర్యాలు లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కళాశాలలోని సీట్లు పూర్తిస్థాయిలో భర్తీకి నోచుకోవడం గగనమవుతోంది. తాజాగా 2026–2027 విద్యాసంవత్సరానికి యూజీ అడ్మిషన్ల కోసం నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టం ఆఫ్ మెడిసిన్ (ఎన్‌సీఐఎస్‌ఎం) బృందం సభ్యులు రెండు రోజులు తనిఖీలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని బనారస్ యూనివర్సిటీ నుంచి వచ్చిన ప్రొఫెసర్లు అంజనా సక్సేనా, లక్ష్మీప్రసాద్ అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, ఆయుర్వేద వైద్యకళాశాలలో తనిఖీలు చేశారు. కళాశాలలోని 50 సీట్లతోపాటు 13 ఈడబ్ల్యూఎస్ సీట్లు కలిపి మొత్తం 63 సీట్లకు సరిపడా ఫ్యాకల్టీ, టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్, ఇతర సౌకర్యాలు తెలుసుకున్నారు. టీచింగ్, టీచింగ్ డైరీ మెయింటెనెన్స్, స్టూడెంట్ అటెండెన్స్ ల్యాండ్, ల్యాబ్, లైబ్రరీ, పలు మొక్కల గార్డెన్, పరికరాలు పరిశీలించారు. సమయానికి టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థులు వస్తున్నారా అని బయోమెట్రిక్ అటెండెన్స్, ఐరిస్ ద్వారా తెలుసుకున్నారు. తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడారు. బయోమెడికల్ వేస్టేజ్ నిర్వహణ, అంబులెన్స్, నర్సింగ్ స్టాఫ్ వివరాలపై ఆరా తీశారు. అలాగే, విద్యార్థులకు సంబంధించిన రెండు హాస్టళ్లను తనిఖీ చేశారు. కళాశాల అనుబంధ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలను కూడా సందర్శించారు. ఇందులో కూడా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ఓపీ, ఐపీ వివరాలను నమోదు చేసుకున్నారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, డైట్, మందులు, వివిధ రకాల చికిత్స గురించి తెలుసుకున్నారు. వంద పడకల ఆస్పత్రి స్థాయికి ఎలాంటి సౌకర్యాలు కల్పించారో తెలుసుకుని వివరాలను ఆన్‌లైన్ ద్వారా ఢిల్లీలోని స్పెషల్ అబ్జర్వర్‌కు అందజేశారు. హెడ్ ఆఫీస్ లింక్ ద్వారా ఆన్‌లైన్‌న్‌లో క్షుణ్ణంగా చూపించి రికార్డు చేయించారు.
ఎన్‌సీఐఎస్‌ఎం నిబంధనలకు అనుకూలంగా..
ఎన్‌సీఐఎస్‌ఎం నిబంధనల ప్రకారం కళాశాలలో కొన్ని అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. బోధనపరంగా హయ్యర్, లోయర్‌లో 12 మంది టీచింగ్ ఫ్యాకల్టీ లేనట్లు తెలుస్తోంది. నాలుగు విభాగాల్లో అసలే ప్రొఫెసర్లు లేకపోవడంతో 12 సీట్లు కోల్పోయే అవకాశం ఉంది. హై ఫ్యాకల్టీ పరంగా మరో మూడు సీట్లు గల్లంతయ్యే అవకాశం ఉంది. నాన్‌టీచింగ్ పరంగా 71 మందికి 28 మంది, 87 మంది సిబ్బందికి 47 మంది, 23 మంది నర్సింగ్ సిబ్బంది అవసరం ఉండగా ఏడుగురు మాత్రమే ఉన్నట్లు సమాచారం. కళాశాలకు ప్రత్యేకంగా పరీక్ష హాల్, డిజిటల్ టైబ్రరీ, అంబులెన్స్ సదుపాయం లేదు. పదేళ్లుగా లైబ్రేరియన్ పోస్టు భర్తీ కావడం లేదు. దీంతో బీఏఎంస్ సీట్లు పదిలంగా ఉంటాయా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
గతేడాది పరిస్థితి రాకూడదు..
గతేడాది కూడా ఈ పరిస్థితులు ఉండటంతో 14 సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. కళాశాల, వైద్యశాలలో ఉన్న లోపాలను సరిదిద్దుతామని ఎన్‌సీఐఎస్‌ఎం అధికారులకు హామీ ఇవ్వడం, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లేఖ రాయడంతో యథావిధిగా సీట్లకు అనుమతించారు. ఇలాంటి లోపాలు ఈ విద్యా సంవత్సరంలో కూడా పునరావృతం కావడంతో మళ్లీ ఆయుర్వేద సీట్లు గల్లంతయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్ తర్వాత ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ఉనికిని కాపాడాలని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే విద్యార్థులు నీట్ పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.
గతేడాది 14 సీట్లు రద్దు..
తిరిగి సాధించుకున్న అధికారులు
ఈ విద్యాసంవత్సరంలో కూడా
కొన్ని గల్లంతయ్యే అవకాశం
సరిపడా సిబ్బంది,
సౌకర్యాలు లేకపోవడమే కారణం
తాజాగా ఎన్‌సీఐఎస్‌ఎం
బృందం తనిఖీలు


