విభజన హామీలు నెరవేర్చాలి | - | Sakshi
Sakshi News home page

విభజన హామీలు నెరవేర్చాలి

May 11 2026 7:26 AM | Updated on May 11 2026 7:26 AM

భూపాలపల్లి అర్బన్‌: తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హమీలను అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా జిల్లాలో అరెస్టు చేసిన సీపీఐ(ఎం) పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాల నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లు గడుస్తున్నా అభివృద్ధి, ఉపాధి, సాగునీరు, పరిశ్రమలు, విద్య, సామాజిక న్యాయం వంటి రంగాల్లో తెలంగాణ ప్రజల ఆశలు నెరవేరలేదన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని, కులగణన చేపట్టకపోవడం బీసీల పట్ల వివక్షకు నిదర్శనమన్నారు.

నిందితులను అరెస్ట్‌ చేయాలి

భూపాలపల్లి అర్బన్‌: కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమారుడికి సంబంధించి వెలుగులోకి వచ్చిన మైనర్‌ బాలికపై అత్యాచార కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేయాలని డీవైఎఫ్‌ఐ జిల్లా గర్ల్స్‌ కన్వీనర్‌ అంబాల స్వర్ణలత ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహిళలు, బాలికల భద్రతను కాపాడాల్సిన పరిస్థితిలో ఇలాంటి ఘటనలు సమాజాన్ని కలవరపెడుతున్నాయని అన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం, పోలీసు శాఖ వెంటనే స్పందించి పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని డిమాండ్‌ చేశారు. నిందితులు ఎవరైనా చట్టం ముందు సమానమేనని, రాజకీయ హోదాలు లేదా ప్రభావంతో కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేయకూడదన్నారు.

జ్యోతిర్లింగ దర్శనం కోసం..

కాళేశ్వరం: దేశంలోని జ్యోతిర్లింగ దర్శనం కోసం ఇద్దరు యువకులు సంవత్సర కాలంగా స్కేటింగ్‌తో ప్రయాణిస్తున్నారు. ఆ ప్రయాణం 20 వేల కిలోమీటర్లు కాగా ఇప్పటికి 7వేల కిలోమీటర్లు పూర్తి చేసినట్లు ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం గోరఖ్‌పూర్‌కు చెందిన మనీష్‌, శంబూసింగ్‌ తెలిపారు. దేశంలోని పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం గొప్పగా ఉందని పేర్కొన్నారు. వేసవికాలంలో ఉదయం, సాయంత్రం వేళల్లో ఎక్కువగా ప్రయాణిస్తున్నామని తెలిపారు. వారి యాత్ర ఆదివారం కాళేశ్వరం చేరింది. కాళేశ్వరం క్షేత్రం గురించి తెలుసుకొని యాత్ర చేస్తున్నట్లు వివరించారు. స్వామిని దర్శించుకొని వెళుతామన్నారు. రోడ్డుపై స్కేటింగ్‌తో వస్తుంటే జనం ఆసక్తిగా తిలకించారు.

అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలి

చిట్యాల: చిట్యాల మండల కేంద్రంలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీపీఐ ఎంఎల్‌ లిబరేషన్‌ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఉన్న అగ్నిమాపక కేంద్రం చిట్యాల, టేకుమట్ల , మొగుళ్లపల్లి మండలాలకు సుమారు 35 కిలోమీటర్లు ఉందని.. దీంతో అగ్రిమాపక శకటం వచ్చే సరికి భారీ నష్టం జరుగుతుందని అన్నారు. చిట్యాల మండల కేంద్రంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేస్తే ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు.

సమాచారం కోసం

సంప్రదించాలి

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్‌ 1వరకు జరుగు సరస్వతీ నది అంత్య పుష్కరాలకు సంబంధించిన సమాచారం కోసం కాళేశ్వరం దేవస్థానంలో సంప్రదించాలని ఈఓ మహేష్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వసతి సౌకర్యం కోసం 94910 18012, ఆర్జిత సేవలకు 94910 17012, ఆలయ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ 94910 15252 నంబర్లలో సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. ప్రతీ రోజు జరిగే హోమంలో పాల్గొనే భక్తులు రూ.2వేలు ఒక రోజుకు దంపతులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. దేవస్థానం నుంచి పూజాసామగ్రి అందజేస్తున్నట్లు తెలిపారు. భక్తులు గమనించాలని ఆయన తెలిపారు.

నేటినుంచి ఎడ్యుకేషన్‌ వీక్‌

కాళేశ్వరం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా హైదరాబాద్‌ ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు వారం రోజుల పాటు విద్య వారోత్సవాలను మే 11 నుంచి 17వ తేదీ వరకు ఎడ్యుకేషన్‌ వీక్‌లో మహదేవపూర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు ప్రినిపాల్‌ జున్ను విజయ్‌కుమార్‌ ఆదివారం తెలిపారు. కళాశాల హాజరు శాతం పెంచడం, ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ కార్యక్రమం, సృజనాత్మక స్కిల్స్‌ పెంచడం, కళాశాల కోసం ఫండ్స్‌ సమకూర్చడం, అభివృద్ధి, వివిధ రకాల సదుపాయం కోసం నిర్వహణ జరుగుతుంది. (నేడు) సోమవారం కళాశాలలో ఉదయం 11 గంటలకు ప్రారంభోత్సవం జరుగుతుందని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement