మంగపేట: మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఈనెల 6వ తేదీతో ముగిసినప్పటికీ భక్తులు భారీగా తరలివస్తున్నారు. స్వయంభు స్వామివారిని దర్శించుకునేందుకు తరలి వచ్చిన భక్తులతో ఆలయం కోలాహలంగా మారింది. ఆదివారం సెలవు రోజు కావడం, బ్రహ్మోత్సవాలకు రాలేకపోయిన భక్తులతో పాటు ఆలయ ప్రాంగణంలో జరిగిన వివాహాలకు తరలివచ్చిన వారితో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో సందడి నెలకొంది. ఆంజనేయస్వామి మాలధారుల మండలం, అర్ధ మండలం దీక్ష చేపట్టిన భక్తుల దీక్ష ముగియడంతో స్వామివారికి ఇరుముడి ఇచ్చి దీక్ష విరమించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయానికి వెళ్లే భక్తులు మార్గమధ్యంలోని లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని వెళ్తున్నారు. అదే విధంగా తిరుగు ప్రయాణంలో సైతం భక్తులు ఆలయానికి స్వామివారిని దర్శించుకునేందుకు రావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయ ప్రాంగణం భక్తజనంతో నిండిపోయింది.


