భూపాలపల్లి అర్బన్: ఇంటర్ ప్రవేశాల షెడ్యూల్ జారీ చేసిన మరుసటి రోజునే ఆ ఉత్తర్వులను నిలుపుదల చేయడం ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులను కలవరపెడుతోంది. ఇప్పటికే ప్రైవేట్ కళాశాలలు, కార్పొరేట్ విద్యాసంస్థలు జోరుగా ప్రచారం పెంచి ప్రవేశాలు చేస్తుండగా.. ప్రభుత్వ కళాశాలలు మూసి ఉండటంతో పేద విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ నెల 8వ తేదీ నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించే అవకాశాలు ఉన్నా ఇప్పటి వరకు ఆదేశాలు జారీ కాలేదు.
జిల్లాలో 34 కళాశాలలు..
జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఐదు, కస్తూర్బా బాలికల విద్యాలయాలు 10, ఆదర్శ పాఠశాలలు ఆరు, ఇతర కళాశాలలు 13 ఇంటర్ విద్యను అందిస్తున్నాయి. ఇటీవల పదోతరగతి ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో 3,483 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో సగానికి పైగా విద్యార్థులు జెడ్పీఎస్‌ఎస్, కేజీబీవీ, ఆదర్శ పాఠశాల్లో చదివిన వారే కావడం గమనార్హం. విద్యార్థులు తమ ఆర్థిక స్థోమత దృష్ట్యా ప్రభుత్వ కళాశాలల్లో చేరేందుకు మొగ్గుచూపుతారు. తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు తక్కువ ఫీజుకే ప్రవేశం కల్పిస్తామని ఆ తర్వాత అదనపు రుసుములను వసూలు చేయడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియను నిలిపివేయడం పేద విద్యార్థులకు నష్టం చేకూర్చేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 4న ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల కాగా.. పలు కళాశాలల అధ్యాపకులు ఉత్సాహంగా మరుసటి రోజున ప్రచారబాట పట్టాయి. అదే రోజు సాయంత్రం ఆ షెడ్యూల్‌ను రద్దు చేస్తున్నట్లు ఇంటర్‌బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ ఉత్తర్వులు జారీచేశారు. జూన్ ఒకటో తేదీ నుంచి కళాశాలలను పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించగా.. ప్రైవేట్ సంస్థలు ప్రచార జోరు పెంచడం ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులను అయోమయానికి గురిచేస్తోంది.
పాఠశాలలో విలీనం..?
రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం నుంచి నూతన జాతీయ విద్యా విధానం అమలు చేయాలని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఇంటర్ విద్యను విలీనం చేయడానికి సిద్ధం చేసినట్లు సమాచారం. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు నూతనంగా ఏర్పాటు చేయనున్న తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో తరగతులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాలల్లో సౌకర్యాలు, సామర్‌ాధ్యలను గుర్తించి టెన్ ప్లస్ టూ విధానం అమలు చేసేలా విద్యా కమిషన్ భావిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగా ఇంటర్ ప్రవేశాల ప్రక్రియను నిలిపివేసినట్లు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చర్చ జరుగుతోంది.
పాత వర్సెస్ కొత్త విధానం
ఈసారి ఆన్‌లైన్ విధానంలో ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలు ఉంటాయా? లేదా పాత పద్ధతిలోనేనా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇంటర్ విద్యను పాఠశాల వ్యవస్థలో విలీనం చేయడాన్ని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం వ్యతిరేకిస్తోంది, దీనివల్ల ఐఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
జూనియర్ కళాశాలలు 34
ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 5
మోడల్ జూనియర్ కళాశాలలు 6
ప్రైవేట్ జూనియర్ కళాశాలలు 4
ట్రైబుల్ వెల్ఫేర్ కళాశాలలు 2
కేజీబీవీ కళాశాలలు 10
సోషల్ వెల్ఫేర్ 2
మైనారిటీ 1
బీసీ వెల్ఫేర్ 4
పాఠశాల విద్యలో బోర్డు విలీనం
12వ తరగతి వరకు పాఠశాల విద్య
ప్రభుత్వ కళాశాలల్లో అయోమయం


