చిట్యాల: మండలంలోని నైన్‌పాక గ్రామంలో ఉచిత (సమ్మర్ క్యాంప్) బాల్ బ్యాడ్మింటన్ శిక్షణను ఏర్పాటు చేసినట్లు బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గూట్ల తిరుపతి, బాల్ బ్యాడ్మింటన్ కోచ్ ఉడుత మోహన్ శనివారం తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు క్రీడలు ఎంతో అవసరం అని అన్నారు. ప్రతీ రోజు ఉదయం 6 గంటల నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6.30 గంటల వరకు శిక్షణ ఉంటుందని అన్నారు. ఈ శిక్షణలో రన్నింగ్, వ్యాయాయంతో పాటు క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
చెరువులో
చేపల మృత్యువాత
చిట్యాల: చైన్‌పాక గ్రామ శివారులోని పెద్దమ్మకుంట చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విషం కలపడంతో 1.50 క్వింటాళ్ల చేపలు మృత్యువాత పడ్డాయి. ముదిరాజ్ సొసైటీ అధ్యక్షుడు బండి నర్సయ్య కథనం ప్రకారం.. చెరువులో చేపలు మృతి చెంది పైకి తేలడంతో గ్రామస్తులు ముదిరాజ్ సంఘం నాయకులకు సమాచారం అందించారని పేర్కొన్నారు. దీంతో శుక్రవారం ఉదయం గ్రామస్తులు, ముదిరాజ్ సంఘం నాయకులు వెళ్లి పరిశీలించారు. కాగా, అదే ప్రాంతంలో పురుగుల మందు వాసన రావడంతో గమనించిన ముదిరాజ్ నాయకులు శనివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. చెరువులో విషం కలిపిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని నర్సయ్య కోరారు.
సభను విజయవంతం చేయండి
ములుగు రూరల్: నేడు (ఆదివారం) సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ ములుగు అర్బన్ అధ్యక్షుడు ఇమ్మడి రాకేష్ యాదవ్ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ మోదీ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు వాసుదేవరెడ్డి, రాకేష్, ప్రమోద్‌రెడ్డి, రవీందర్, ప్రవీణ్, కోటేశ్వర్ పాల్గొన్నారు.
13న పాలిటెక్నిక్ ఎంట్రన్స్
ములుగు రూరల్: ఈ నెల 13న పాలిసెట్ ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పాలిసెట్ జిల్లా కోఆర్డినేటర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కొప్పుల మల్లేశం శనివారం తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ములుగు, జాకారం బాలుర సోషల్ వెల్పేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీతో కలిపి రెండు సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెండు సెంటర్లలో 675 మంది విద్యార్థులను కేటాయించినట్లు తెలిపారు. 13వ తేదీ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. నిమిషం ఆలస్యం అయినా అనుమతించేది లేదని తెలిపారు. విద్యార్థులు ఇటీవల డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్‌తో రావాలని.. వారి వెంట హెచ్‌బీ పెన్సిల్, బాల్ పాయింట్ పెన్, ఎరేజర్, షార్ప్‌నర్‌లు తీసుకురావాలని తెలిపారు.
వాహనం ఢీకొని గేదెలు మృతి
వెంకటాపురం(కె): గుర్తుతెలియని వాహనం ఢీకొని ఐదు గేదెలు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని పాత్రాపరం గామ శివారులో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్లోగూడెం గ్రామానికి చెందిన రాంబాబు తన గేదెలను శుక్రవారం ఉదయం పాలెం వాగు సమీపంలోకి మేతకు తీసుకెళ్లాడు. రాత్రి గేదెలు ఇంటికి రాలేదు. శనివారం ఉదయం గేదెల కోసం వెతుకుతుండగా పాత్రాపురం పాలెం వాగు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెంది కనిపించాయి. పాత్రాపురం సర్పంచ్ బొగ్గుల పుష్పవతి సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు.


