తాగునీటి వ్యధ | - | Sakshi
Sakshi News home page

తాగునీటి వ్యధ

May 9 2026 8:02 AM | Updated on May 9 2026 8:02 AM

మున్సిపల్‌లో రెండు, మూడు రోజులకోసారి నల్లానీరు నల్లానీటి కోసం పడిగాపులు.. ఉన్నది రెండే ట్యాంకర్లు..

మున్సిపాలిటీ వివరాలు..

భూపాలపల్లి: వేసవి వచ్చిందంటే చాలు.. తాగునీరు, ఇతర అవసరాలకు భూపాలపల్లి పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మిషన్‌ భగీరథ నల్లానీరు రోజు విడిచి రోజు వస్తుండటంతో బోర్లు లేని వారు గుక్కెడు నీళ్ల కోసం నల్లానీరు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. విలీన గ్రామాలనైతే పట్టించుకునే వారే కరువయ్యారు.

మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా సగానికి పైగా వార్డుల్లోని ప్రజలు తాగునీటి తిప్పలు పడుతున్నారు. అన్ని కాలనీలకు మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ ఉన్నప్పటికీ రోజు విడిచి రోజు నల్లానీరు వస్తుంది. ప్రధానంగా రాజీవ్‌నగర్‌, క్రిష్ణాకాలనీ, బాంబులగడ్డ, సీఆర్‌నగర్‌, మంజూర్‌నగర్‌తో పాటు విలీన గ్రామాలైన బెడ్డెలపల్లి, గడ్డిగానిపల్లి గ్రామాల వైపు రెండు రోజులకొకసారి మిషన్‌ భగీరథ నీరు సరఫరా చేస్తున్నారు. దీంతో ఆయా కాలనీల ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేసేది లేక చేతి పంపులు, పవర్‌ బోర్లను ఆశ్రయిస్తున్నారు. పట్టణంలోని కాలనీల్లో సొంతంగా పవర్‌ బోర్లు లేని వారైతే నల్లానీటి కోసం పడిగాపులు కాస్తున్నారు. ఉన్న నీటిని సర్దుకుంటూ నల్లానీటి కోసం ఎదురుచూస్తున్నారు. అంతేకాక మిషన్‌ భగీరథ నీటిని రాత్రి వేళలు, తెల్లవారుజామున వదులుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే ఈ నెల చివరలో ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మున్సిపాలిటీకి సంబంధించిన వాటర్‌ ట్యాంకర్లు రెండు మాత్రమే ఉన్నాయి. అందులో ఒక ట్యాంకర్‌ను జిల్లా ప్రధాన ఆస్పత్రికి, మరో ట్యాంకర్‌ను జాతీయ రహదారి మధ్యలో నాటిన మొక్కలకు నీరందించేందుకు వినియోగిస్తున్నారు. గతంలో వేసవిలో మూడు, నాలుగు వాటర్‌ ట్యాంకర్లను అద్దెకు తీసుకొని నీటి ఎద్దడి ఉన్న కాలనీలకు తాగునీటిని సరఫరా చేసేవారు. మిషన్‌ భగీరథ పథకం వచ్చిందనే కారణంతో ట్యాంకర్లను అద్దెకు తీసుకోవడం లేదు. దీంతో పైప్‌లైన్‌ లీకేజీలు, విద్యుత్‌ సమస్య వచ్చినప్పుడు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వారం రోజుల క్రితం మహాముత్తారం మండలం కోనంపేట వద్ద చెట్లు కూలి విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో భూపాలపల్లి పట్టణానికి రెండు రోజుల పాటు తాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

బెడ్డెలపల్లిలో వ్యవసాయ బోరు నీటిని బాటిళ్లలో పడుతున్న లక్ష్మయ్య, బాంబులగడ్డలో నల్లానీరు రాకపోవడంతో బోరుకు పైప్‌లైన్‌ బిగిస్తున్న మహిళ

వార్డులు 30

గృహాల సంఖ్య 17,220

జనాభా (సుమారుగా) 80 వేలు

వాటర్‌ ట్యాంకర్లు 2

చేతిపంపులు 25

పనిచేస్తున్నవి 24

పవర్‌బోర్లు 109

పనిచేస్తున్నవి 108

మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ 113 కిలోమీటర్లు

మిషన్‌ భగీరథ

నల్లా కనెక్షన్లు 13,400

రోజుకు అవసరమైన

తాగునీరు 11 మిలియన్‌ లీటర్లు

సరఫరా చేస్తున్నది 10.5 మిలియన్‌ లీటర్లు

గొంతు తడుపుకునేందుకు

తప్పని ఇబ్బందులు

బోర్లను ఆశ్రయిస్తున్న ప్రజలు

పట్టించుకోని అధికారులు, పాలకవర్గం

Advertisement
 
Advertisement
Advertisement