మల్హర్: రైతులు తమ ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం తాడిచర్ల ఆధ్వర్యంలో రుద్రారం, దుబ్బపేట గ్రామాలలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రకాశ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాల ద్వారా గిట్టుబాటు ధరను పొందాలన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొండి, సర్పంచ్‌లు చంద్రగిరి సంపత్, భుక్య రవీందర్, కొండ రాజమ్మ, పీఏసీఎస్ డైరెక్టర్ సంగెం రమేష్, మండల నాయకులు బడితల రాజయ్య, వేముల చంద్రమౌళి, చంద్రగిరి అశోక్, సమ్మయ్య, సీఈఓ సంతోష్, రైతులు, హమాలీలు, సిబ్బంది పాల్గొన్నారు.
సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి
భూపాలపల్లి అర్బన్: సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి, రాష్ట్ర కార్యదర్శి రావుల రమేశ్ డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బానోత్ సేవానాయక్ అధ్యక్షతన శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి, రమేశ్ మాట్లాడారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగుల భవిష్యత్ భద్రతకు ముప్పుగా మారిందన్నారు. ఎన్నికల హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ ఉద్యోగుల డీఏ బకాయిలను వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిలర్ ముత్యాల రఘుపతి, నాయకులు అన్నారెడ్డి, పెద్దన్న, అశోక్, మోహన్, శ్రీనివాసరావు, నరేష్ పాల్గొన్నారు.
రేషన్ బియ్యం పట్టివేత
రేగొండ: కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో శుక్రవారం సివిల్ సప్లై అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి 9 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొత్తపల్లిగోరి గ్రామానికి చెందిన చాపతి రమ ప్రజల నుంచి కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని ఇంట్లో నిల్వ చేసింది. సివిల్ సప్లై అధికారులకు వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సివిల్ సప్లై రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయి త్రిలోక్‌నాథ్ రెడ్డి తెలిపారు.
దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి రూరల్: ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న ఎస్సీ విద్యార్థులు పెండింగ్ స్కాలర్‌షిప్‌ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి ఇందిర శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
వడదెబ్బతో రైతు మృతి
మొగుళ్లపల్లి: వడదెబ్బకు గురై రైతు మృతిచెందిన ఘటన మండలంలోని బద్దంపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. బద్దంపల్లి గ్రామానికి చెందిన సామల రాజిరెడ్డి(65) తన పంట చేను వద్దకు వెళ్లి పనులు ముగించుకొని సాయంత్రం ఇంటి చేరుకున్నాడు. ఎండ తీవ్రతతో అస్వస్థతగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పి.. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు 108కి సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ చేరుకునేలోపే మృతి చెందాడు. మృతుడికి భార్య రాధ ఉంది. రోజంతా ఎండలో పని చేయడంతో వడదెబ్బతో అస్వస్థతకు గురై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
నైపుణ్యాధారిత శిక్షణ
కేయూ క్యాంపస్: విద్యార్థులకు నైపుణ్యాధారిత శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వర్సిటీలోని సెనేట్ హాల్‌లో అధ్యాపకులకు, డీన్‌లకు, యూనివర్సిటీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.


