అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలి

May 9 2026 8:02 AM | Updated on May 9 2026 8:02 AM

ములుగు రూరల్‌: జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం కలెక్టర్‌ సమావేశ మందిరంలో కలెక్టర్‌ హేమంత్‌ సహదేవరావు, డీఎఫ్‌ఓ వికాష మీనాతో కలిసి జిల్లా అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా సమగ్ర అభివృద్ధి సాధించడంతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందన్నారు. ప్రజా దర్భార్‌ ద్వారా ప్రజల సమస్యలు నేరుగా పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేశామని, అందులో వచ్చిన ఫిర్యాదుల స్థితిగతులపై పూర్తిస్థాయిలో ప్రత్యేక అధికారిని నియమిస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రజా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. నూతన గ్రామ పంచాయతీ భవనాలకు అంచనాలు సిద్ధం చేసి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీరు, డ్రెయినేజీలు వంటి అత్యవసర పనులకే నిధుల ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పాఠశాలలు, వసతి గృహాలు ప్రా రంభమయ్యే నాటికి వాటిలో సమస్యలను గుర్తించి పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మహేందర్‌, ఆర్డీఓ వెంకటేష్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రేగ కల్యాణి, తదితరులు ఉన్నారు.

చట్టాలపై అవగాహన ఉండాలి

బాలల సంరక్షణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని మంత్రి డాక్టర్‌ దనసరి సీతక్క అన్నారు. శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ హేమంత్‌ సహదేవరావుతో కలిసి బాలల హక్కుల పరిరక్షణ చట్టాలపై వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతీఒక్కరూ పాటుపడాలన్నారు. ఆడపిల్లలను చదివించాలని, ప్రభుత్వం అందుకు అనుగుణంగా అవకాశాలు కల్పిస్తుందన్నారు. మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాలల వివాహాలపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలలపై లైంగిక వేదింపులు, దత్తత విధానం, చైల్డ్‌ లైన్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి ప్రేమలత, డీఎఫ్‌ఓ వికాస్‌ మీనా, అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ, ఆర్డీఓ వెంకటేశ్‌, అధికారులు పాల్గొన్నారు.

ఒలింపిక్‌ స్థాయికి ఎదగాలి

క్రీడాకారులు ఒలింపిక్‌ స్థాయికి ఎదగాలని మంత్రి సీతక్క అన్నారు. జగ్గన్నపేట ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన రెజ్లింగ్‌ కోచింగ్‌ సెంటర్‌ను కలెక్టర్‌ హేమంత్‌ సహదేవరావుప్రారంభించారు.

పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క

Advertisement
 
Advertisement
Advertisement