● వివాదంగా మారిన వేంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రం మంజూరునగర్ శ్రీ భూనీల వేంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ ప్ర మాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం ఉద్రిక్త వాతా వరణంలో జరిగింది. ఆలయ ఈవో మహేష్ ఆధ్వర్యంలో సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఉద యం నుంచే ఆలయ పరిసరాల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రాజకీయ నాయకుల రాకపోకలు పెరగడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆలయాన్ని రాజకీయాలకు వేదిక చేయొద్దు..
భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సతీమణి బీఆర్‌ఎస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పార్టీ నాయకులతో కలిసి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన గండ్ర ఆలయ నిర్మాణ పనులు పూర్తికాకముందే ఎండోమెంట్ కమిటీ నియామకం, ప్రమాణ స్వీకారం నిర్వహించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఆలయాన్ని రాజకీయాలకు వేదిక చేయకుండా అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు.
బీఆర్‌ఎస్ నాయకుల ధర్నా, అరెస్ట్
ఆలయం వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని భావించిన పోలీసులు గండ్ర వెంకటరమణారెడ్డి, గండ్ర జ్యోతి సహా పలువురు నాయకులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో నాయకులు, పోలీసుల మధ్య కొద్దిసేపు వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకుంది. అనంతరం వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు నిరసనగా బీఆర్‌ఎస్ నాయకులు అంబేడ్కర్ సెంటర్‌లో ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. గండ్ర జ్యోతి అస్వస్థతకు గురికావడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.


