వన్యప్రాణుల దాహం తీరేదెలా? | - | Sakshi
Sakshi News home page

వన్యప్రాణుల దాహం తీరేదెలా?

May 9 2026 8:02 AM | Updated on May 9 2026 8:02 AM

అటవీలో నిరుపయోగంగా సాసర్‌ పిట్స్‌

వేసవిలో మూగజీవాలకు

తాగునీటి కష్టాలు

కన్నాయిగూడెం: మండే ఎండలకు వన్యప్రాణులు దాహంతో అల్లాడుతున్నాయి. అటవీశాఖ ఆధ్వర్యంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నీటికుంటలు (సాసర్‌పిట్స్‌) నిరుపయోగంగా మారాయి. కేవలం పేరుకు మాత్రమే సాసర్‌ పిట్స్‌ ఏర్పాటు చేశారని, వాటిలో నీటిని నింపడంలో అధికారులు చొరప చూపడం లేదని వన్యప్రాణి ప్రేమికులు అంటున్నారు. దాహం తీర్చుకునేందుకు దూరంలో ఉన్న నీటి కుంటలు, చెరువులు, రైతు పొలాల వద్దకు వెళ్తున్నాయి. దీంతో అదను చూసి వేటగాళ్లు వన్యప్రాణులను అంతం చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

ఐలాపూర్‌, సర్వాయి అటవీ ప్రాంతంలో..

కన్నాయిగూడెం మండలం దాదాపు అటవీ ప్రాంతం కావడంతో వన్యప్రాణులు ఎక్కువగా ఉంటాయి. దీంతో అటవీశాఖ అధికారులు ఐలాపూర్‌, సర్వాయి, భూపతిపురం, చిట్యాల, తుపాకులగూడెం తదితర అటవీ గ్రామాల పరిధిలో సిమెంట్‌తో సాసర్‌పిట్స్‌ ఏర్పాటు చేశారు. వాటికి నీటి వసతి కోసం బోరు వేసి సోలార్‌ విద్యుత్‌తో మోటారు నడిచేలా ఏర్పాటు చేసి నీటి వసతి కల్పించారు.

పనిచేయని సోలార్‌ పంపులు..

వన్యప్రాణుల దాహం తీర్చడానికి ఏర్పాటు చేసిన సాసర్‌పిట్స్‌ నీరులేక నిరుపయోగంగా మారాయి. అధికారుల నిర్లక్ష్యంతో సోలార్‌ విద్యుత్‌ పంపులు పనిచేయకపోవడంతో సాసర్‌పిట్స్‌ బీటలువారి ఎండిన ఆకులతో నీరు లేకుండా దర్శనమిస్తున్నాయి. ఇప్పటికై నా అటవీశాఖ అధికారులు, ఉన్నతాధికారులు చొరవ తీసుకుని సాసర్‌పిట్స్‌లో నీరు ఏర్పాటు చేయించాలని వన్యప్రాణి ప్రేమికులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement