భూసార పరీక్షలతో మేలు | - | Sakshi
Sakshi News home page

భూసార పరీక్షలతో మేలు

May 8 2026 12:19 PM | Updated on May 8 2026 12:19 PM

మట్టి పరీక్షలతో పెట్టుబడి తగ్గించుకోవచ్చు..

ములుగు రూరల్‌: భూసారానికి అనుగుణంగా పంటలను సాగు చేయించి నాణ్యమైన అధిక దిగుబడులు సాధించాలనే లక్ష్యంలో ప్రభుత్వం సాగు భూముల్లో భూసార పరీక్షలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా రెవెన్యూ గ్రామాల వారీగా వలంటీర్లను నియమించారు. ములుగు జిల్లాలోని పది మండలాల్లో వలంటీర్లను ఎంపిక చేసి వ్యవసాయ శాస్త్రవేత్తలతో శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం భూసార పరీక్షల నిమిత్తం పంట పొలాల్లో మట్టి నమూనాలను సేకరించనున్నారు.

మట్టి పరీక్షలతో పోషకాల అంచనా

భూసార పరీక్షల ఆధారంగా భూముల్లో పోషకాల మోతుదు తెలుస్తుంది. పోషకాలు తక్కువ ఉన్న నేలలను గుర్తించి వ్యవసాయ శాఖ అధికారులు వాటిని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించేందుకు వీలుగా ఉంటుంది. భూమిలో భాస్వరం, నత్రజని, పొటాషియం, ఐరన్‌, జింక్‌, బోరాన్‌, మెగ్నీషియం శాతాన్ని గుర్తిస్తారు. భూమిలోని పోషకాల ఆధారంగా సాగు చేసేందుకు అనువుగా ఉన్న పంటలను సూచిస్తారు. ఎరువుల వాడకంలో మోతాదు సిఫార్సు చేస్తారు. దీంతో ఎరువుల వినియోగం, అధిక ఖర్చులను తగ్గించుకోవచ్చు. సేద్యపు రంగంలో ఆధునిక పద్ధతులను అనుసరించి పెట్టుబడి ఖర్చు తగ్గించుకొని అధిక దిగుబడులు సాధించే దిశగా వ్యవసాయశాఖ అడుగులు వేస్తోంది.

10 మండలాలు.. 287 రెవెన్యూ గ్రామాలు

జిల్లాలోని పది మండలాల్లో మొత్తం 287 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇందులో ఒక్కో రెవెన్యూ గ్రామానికి ముగ్గురు చొప్పున వలంటీర్లు 861 మందిని ఎంపిక చేశారు. కానీ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ గ్రామానికి ఒక వలంటీర్‌కు మాత్రమే శిక్షణ అందించారు. మిగితా వారికి అందించనున్నారు. శిక్షణ ఇచ్చిన ఒక్కో వలంటీర్‌కు వ్యవసాయ క్షేత్రాల ఎంపిక, మట్టి నమూనా సేకరణ విధానం, పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వలంటీర్లకు అవగాహన కల్పించారు. వ్యవసాయ అధికారులతో కలిసి ఇప్పటి వరకు రెవెన్యూ గ్రామానికి 10 శాంపిళ్లను సేకరించారు. ఇప్పటి వరకు వలంటీర్లు మొత్తం 2,862 మట్టి శాంపిళ్లను సేకరించి 2,854 శాంపిళ్లను వరంగల్‌లోని ల్యాబ్‌లకు పంపించారు. జిల్లాలో రైతులు వరి 1,07,700 ఎకరాల్లో సాగు చేయగా పత్తి 28,600 ఎకరాలు, మొక్కజొన్న 11 వేల 32 ఎకరాలు, మిర్చి 25 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు.

రెవెన్యూ గ్రామాల వారీగా వలంటీర్లు

వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో శిక్షణ

క్షేత్రస్థాయిలో మట్టి నమూనాల సేకరణ

భూసార పరీక్షలతో రైతులు సాగు చేస్తున్న పంటలకు పెట్టుబడి ఖర్చులు తగ్గించుకొని భూమికి, పంటకు అవసరమయ్యే ఎరువులను మాత్రమే వాడొచ్చు. భూమి స్వభావాన్ని బట్టి పంటలు సాగు చేసుకోవాలి. మే నెల చివరి వరకు మట్టి నమూనాలను సేకరిస్తాం. పరీక్షల అనంతరం రైతులకు వారి భూమి తత్వాన్ని వివరించి సాగు చేసుకోవాల్సిన పంటలను, వినియోగించే ఎరువులను వివరిస్తాం, దీంతో నత్రజని ఎరువుల విని యోగం తగ్గించడానికి వీలుగా ఉంటుంది.

– సురేశ్‌కుమార్‌,

జిల్లా వ్యవసాయశాఖ అధికారి

Advertisement
 
Advertisement
Advertisement