భూపాలపల్లి అర్బన్: జిల్లా పోలీసుల వార్షిక మొబిలైజేషన్ శిక్షణలో భాగంగా వరంగల్ జిల్లా అమ్మవారిపేట ఫైరింగ్ రేంజ్‌లో బుధవారం ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ హాజరై.. అధికారుల ఫైరింగ్‌ను పరిశీలించి సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో సమర్థవంతంగా స్పందించేందుకు ఆయుధాలపై పూర్తి ప్రావీణ్యం అవసరమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
నేడు సమీక్ష
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్ 1 వరకు జరుగు సరస్వతీనది అంత్యపుష్కరాల పనుల పురోగతిపైన గురువారం ఉదయం ఈఓ కార్యాలయంలో 10.30 గంటలకు అన్నీ శాఖల అధికారులతో దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజారామయ్యర్ సమీక్ష నిర్వహించనున్నట్లు ఈఓ మహేష్ బుధవారం తెలిపారు. అధికారులు సకాలంలో హాజరు కావాలని ఆయన కోరారు.
కోఆప్షన్ మెంబర్లకు
అభినందన
భూపాలపల్లి రూరల్: మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్లను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు బుధవారం మున్సిపల్ కార్యాలయంలో అభినందించి సన్మానించారు. కో ఆప్షన్ మెంబర్లుగా సజ్జనపు స్వామి, చల్లా రేణుక, ఎండీ అబ్దుల్ హఫీజ్, ఎండీ మిన్హాజ్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులుపాల్గొన్నారు.
13నుంచి ఇంటర్
సప్లిమెంటరీ పరీక్షలు
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 13వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధికారి వెంకన్న బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 19వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 9గంటల నుంచి మఽధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం 2గంటల నుంచి 5గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
గ్యాస్, పెట్రోల్,
డీజిల్ ధరలను తగ్గించాలి
భూపాలపల్లి అర్బన్: పేద, మధ్యతరగతి ప్రజలపై కేంద్ర ప్రభుత్వం పెంచిన ఇంధన ధరలు తీవ్రమైన భారంగా మారాయని, వెంటనే తగ్గించాలని సీపీఐ పట్టణ కార్యదర్శి సొత్కు ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్‌లో సీపీఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు వేముల శ్రీకాంత్, నేరెళ్ల జోసెఫ్, బూడిద తిరుపతి, ఎండియాకు పాషా, గోలి లావణ్య, పల్లెల రజిత, పొనగంటి లావణ్య, గడ్డం స్వరూప, గంప రాజు పాల్గొన్నారు.
రావి ఆకుపై హీరో విజయ్ చిత్రం
ఏటూరునాగారం: తమిళనాడు హీరో విజయ్ సీఎంగా ఎన్నిక కాబోతున్న శుభ సందర్భంగా రావి ఆకుపై విజయ్ బొమ్మను మండల కేంద్రానికి చెందిన డ్రాయింగ్ మాస్టర్ రమేశ్ గీశారు. మండల పరిధిలోని చిన్నబోయినపల్లి ఆశ్రమ పాఠశాల డ్రాయింగ్ టీచర్ రమేశ్ వినూత్నంగా ఆలోచించారు. రావి ఆకుపై కాబోయే తమిళనాడు సీఎం విజయ్ చిత్రాన్ని అద్భుతంగా గీసి ప్రదర్శించారు. ఆయన ప్రతిభను స్థానికులు అభినందించారు.


