ఉద్యాన పంటలపై దృష్టి పెట్టాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యాన పంటలపై దృష్టి పెట్టాలి

May 6 2026 8:07 AM | Updated on May 6 2026 8:07 AM

చిట్యాల: రైతులు ఉద్యాన పంటల సాగు, ఆయిల్‌ ఫామ్‌ సాగు విస్తీర్ణం పెంపు, ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా జూకల్‌ గ్రామంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి రైతు సదస్సును మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ రైతును రాజు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పంట మార్పిడి పద్ధతులను అవలంబించి ఉద్యావన పంటలపై రైతులు దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ జిల్లా అధికారి సునీల్‌ కుమార్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాడి బాబురావు, డీసీఓ వాల్యూ నాయక్‌, భూపాలపల్లి ఏడీఏ రమేష్‌, ఏడు మండలాలకు చెందిన వ్యవసాయ శాఖ అధికారులు, ఏఈఓలు, హెచ్‌ఈఓలు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గుమ్మడి శ్రీదేవి, తహసీల్దార్‌ వసంతరావు, ఎంపీడీ ఓ జయశ్రీ, సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.

కాటారం ఆర్డీఓగా రవీందర్‌

మల్హర్‌ (కాటారం): కాటారం రెవెన్యూ డివిజనల్‌ అధికారిగా (ఆర్డీఓ) రవీందర్‌ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ పనిచేసిన సబ్‌ కలెక్టర్‌ మయాంక్‌ సింగ్‌ హైదరాబాద్‌కు ఇటీవల బదిలీ అయిన విషయం తెలిసిందే. కాగా, ఆయన స్థానంలో కాటారం ఆర్డీఓగా రవీందర్‌ వచ్చారు.

ఆయిల్‌పామ్‌ సాగుతో అధిక లాభాలు

ములుగు: ఆయిల్‌పామ్‌ పంటసాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని ములుగు అదనపు కలెక్టర్‌ సంపత్‌రావు పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉద్యానవన శాఖ అధికారి సంజీవరావు అధ్యక్షతన ములుగు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పంటలసాగుపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ ఉద్యానవన, ప్రత్యామ్నాయ పంటలపై రైతులు ఆసక్తి చూపాలని పిలుపునిచ్చారు. మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటలను సాగు చేయడం ద్వారా రైతులకు మెరుగైన ఆదాయం లభిస్తుందని తెలిపారు. ఆయిల్‌పామ్‌ సాగులో అంతర్గత పంటలను కూడా పండించవచ్చని తెలిపారు. దీంతో రైతులకు రెండు పంటల ద్వారా ఆదాయం లభించే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఒకసారి ఆయిల్‌పామ్‌ సాగుబడి చేస్తే 30 సంవత్సరాల వరకు నిరంతర పంట దిగుబడితో ఆదాయం వస్తుందని స్పష్టంచేశారు. అనంతరం ఉద్యానశాఖ అధికారి సంజీవరావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1,069 మంది రైతులు 3,562.40 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌ పామ్‌ సాగు చేస్తున్నారని తెలిపారు. ఒక ఎకరాకు ప్రభుత్వం రూ.50 వేల వరకు సబ్సిడీ అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ములుగు మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ చింతనిప్పుల చంద్రకళ, ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్‌ పద్మావతి, ఆత్మ కమిటీ చైర్మన్‌ రవీందర్‌ రెడ్డి, కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్‌ గౌడ్‌, జిల్లా మత్స్యశాఖ అధికారి సాల్మన్‌ రాజు, డీసీఓ రామ్మోహన్‌, కేఎన్‌ బయోసైన్స్‌ కంపెనీ ఎండి సుధారెడ్డి పాల్గొన్నారు.

వైభవంగా హేమాచలుడి నాగవెల్లి

మంగపేట: మల్లూరులోని శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి దేవతామూర్తులకు నాగవెల్లి కార్యక్రమాన్ని బ్రహ్మోత్సవాల యాగ్నికులు మంగళవారం రాత్రి నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయంలో కొనసాగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ఇన్‌చార్జ్‌ కార్యనిర్వాహణ అధికారి ఎం. వీరస్వామి, చీఫ్‌ ఫెస్టివల్‌ ఆఫీసర్‌ శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకులు అమరవాది మురళీకష్ణమాచార్యుల బృందం, ఆలయ అర్చకులు ఉదయం స్వామివారికి నిత్యపూజ, సేవాకాలం, బాలభోగం నిత్యహోమం, చతుస్థానార్చన, ఉత్సవ మూర్తులకు నవకలశ అభిషేక పూజలు, మమానివేదన కార్యక్రమాలను నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement