● కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి: ఈనెల 15వ తేదీలోపు సరస్వతి అంత్య పుష్కరాల పనులను పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌తో కలిసి సరస్వతి అంత్య పుష్కరాల పనుల పురోగతిపై రెవెన్యూ, పోలీస్, అటవీ, రవాణా, వైద్య, ఇరిగేషన్, అగ్నిమాపక, విద్యుత్, మత్స్య, ఆర్టీసీ, మిషన్ భగీరథ, దేవాదాయ, పీఆర్, కేఎంకే, తదితర శాఖల అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా చేపట్టిన పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ భక్తులకు చలువ పందిళ్లు, బట్టలు మార్చుకునే గదులు, దివ్యాంగుల కోసం బ్యాటరీ ఆపరేటెడ్ వాహనాలు ఏర్పాటు చేయాలన్నారు. హెలిప్యాడ్ నుంచి సరస్వతి ఘాట్ వరకు బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. పోలీస్, ఆర్‌అండ్‌బీ అధికారులు సంయుక్తంగా రహదారులను పరిశీలించి మరమ్మతులు చేపట్టాలన్నారు. తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, సురక్షిత మంచినీరు సరఫరా చేయాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. వ్యర్థాల తరలింపునకు ట్రాక్టర్లు, బ్లీచింగ్ అందుబాటులో ఉంచాలని డీపీఓకు సూచించారు. బస్టాండ్ వద్ద విద్యుత్ సరఫరా, ప్రయాణికుల కోసం షెడ్లు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులకు చెప్పారు. హారతి, తెప్పోత్సవం కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని దేవాదాయ అధికారులను ఆదేశించారు. రెస్క్యూ టీములు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో అటవీశాఖ అధికారి నవీన్ రెడ్డి, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, రవాణా శాఖ అధికారి సంథాని, డీఎంహెచ్‌ఓ డాక్టర్ మధుసూదన్, ఇరిగేషన్ ఈఈ తిరుపతి రావు, అగ్నిమాపక అధికారి సతీష్ కుమార్, డీపీఓ శ్రీలత, ఆర్టీసీ డీఎం ఇందు, ఆర్‌అండ్‌బీ ఈఈ రమేష్, మిషన్ భగీరథ ఈఈ శ్వేత, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, మత్స్యశాఖ అధికారి విజయ్ కుమార్, కాళేశ్వరం దేవస్థానం ఈఓ మహేష్, తదితరులు పాల్గొన్నారు.
ఎండల తీవ్రత దృష్ట్యా ఆరోగ్యం జాగ్రత్త
రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా ఆరోగ్యపై జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. వేసవి కాలంలో వడదెబ్బ సోకే ప్రమాదముందని, ఈ క్రమంలో ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ప్రత్యేకించి చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, గుండె సంబంధిత వ్యాధులున్న వారు, కూలీలు జాగ్రత్తలు పాటించాలన్నారు.


