భూపాలపల్లి: అన్నదాతలకు ప్రతీ ఏటా ప్రతీ సీజన్‌లో ధాన్యం విక్రయించే విషయంలో బాధలు తప్పడం లేదు. వానాకాలం సీజన్‌లో సమయానికి వర్షాలు కురవకపోవడం, పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు కురవడంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నష్టాలను అధిగమించేందుకు యాసంగిలో మొక్కజొన్న సాగుచేస్తే కొనే వారు కరువయ్యారు.
మక్కల కొనుగోలుకు నిరీక్షణ..
జిల్లాలోని 12 మండలాల్లోని రైతులు 29వేలకు పైగా ఎకరాల్లో ఈ యాసంగిలో మొక్కజొన్న పంటను సాగుచేశారు. జిల్లా మొత్తంగా సుమారు 39,500 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు 12 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని పేర్కొని.. ఇప్పటివరకు ఏడింటిని మాత్రమే ప్రారంభించారు. ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లో సైతం జొన్నల కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదు. ప్రభుత్వం గన్నీ సంచులను అందించకపోవడమే కాకుండా రవాణా చేసే లారీల కొరత తీవ్రంగా ఉంది. దీంతో పక్షం రోజుల క్రితం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన రైతులకు చెందిన మక్కలను సైతం నిర్వాహకులు కొనలేని పరిస్థితి నెలకొంది. గన్నీ సంచులు మీరే కొనుగోలు చేసుకోవాలని, తర్వాత బిల్లులు చెల్లిస్తామని నిర్వాహకులు చెబుతుండటంతో రైతులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.
అకాల వర్షంతో రైతుల్లో ఆందోళన..
మూడు రోజుల పాటు జిల్లాలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో మొక్కజొన్న రైతుల్లో ఆందోళన నెలకొంది. మూడు నెలల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్న పంట ఇప్పుడు నీటి పాలైతే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం రాత్రి జిల్లాలో ఈదురుగాలులు వీస్తూ, ఉరుముల శబ్ధం రావడంతో రైతులు ఆందోళన చెందారు. చేసేది లేక కొనుగోలు కేంద్రాల్లోని మొక్కజొన్న బస్తాలపై పరదాలు కప్పి అక్కడే పడిగాపులు కాస్తున్నారు. అకాల వర్షం కురిస్తే మాత్రం మక్కలు దెబ్బతింటాయని, అప్పుడు కొనేందుకు ప్రభుత్వం సైతం కొర్రీలు విధిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా కొనుగోళ్లను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
గన్నీ సంచులు లేవు.. లారీలు రావు
కొనుగోళ్ల కోసం రోజుల తరబడి నిరీక్షణ
అకాలవర్షంతో ఆందోళనలో మొక్కజొన్న రైతులు


