ప్రజావాణికి 11 దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణికి 11 దరఖాస్తులు

May 5 2026 7:08 AM | Updated on May 5 2026 7:08 AM

మల్హర్‌(కాటారం): కాటారం సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి డివిజన్‌ స్థాయిలోని కాటారం, మల్హర్‌, మహాముత్తారం, మహాదేవపూర్‌, పలిమెల మండలాల నుంచి వివిధ సమస్యలపై 11 దరఖాస్తులు వచ్చినట్లు ఇన్‌చార్జ్‌ సబ్‌ కలెక్టర్‌ హరికృష్ణ తెలిపారు. ప్రజావాణి ద్వారా అందిన ప్రతీ వినతిని ప్రాధాన్యంగా తీసుకోని నిర్ధిష్ట కాల పరిమితిలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులకు హరికృష్ణ సూచించారు. ఈ కార్యాక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

లాటరీ పద్ధతిలో సీట్ల కేటాయింపు

భూపాలపల్లి అర్బన్‌: తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న నాన్‌–మైనారిటీ అభ్యర్థులకు లాటరీ పద్ధతిలో సీట్ల కేటాయింపు చేపట్టనున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్‌ రవి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీన జిల్లా మైనారిటీ అధికారి, ఉమ్మడి వరంగల్‌ మైనారిటీ పాఠశాలల కోఆర్డినేటర్‌ ఎదుట లాటరీ తీయనున్నట్లు తెలిపారు. ఉదయం 9:30 గంటలకు జిల్లా కేంద్రంలోని పాఠశాల ఆవరణలో, జిల్లా మైనారిటీ అధికారి, ఉమ్మడి వరంగల్‌ మైనారిటీ పాఠశాలల కోఆర్డినేటర్‌, పాఠశాల ప్రిన్సిపాల్‌ సమక్షంలో దరఖాస్తులను పరిశీలించి లాటరీ ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందన్నారు.

రేపు వెరిఫికేషన్‌

మొగుళ్లపల్లి: ఎస్సీ కార్పొరేషన్‌ 2025–26 రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఈనెల 6న బుధవారం సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ సురేందర్‌గౌడ్‌ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు దరఖాస్తుదారులు తమ ఆధార్‌, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన అన్ని ప్రతులతో హాజరుకావాలని కోరారు. అర్హత గల వారందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.

గంజాయి రవాణాదారుల అరెస్ట్‌

టేకుమట్ల: అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని బోర్నపల్లికి చెందిన మీనుగు వంశీక్రిష్ణతో పాటు, పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి చెందిన పసుపులేటి సంతోష్‌, ఓడేడ్‌ గ్రామానికి చెందిన బీముని గణేష్‌ మహారాష్ట్ర చంద్రాపూర్‌ నుంచి గంజాయిని తీసుకువచ్చి జిల్లాలోని ఆయా మండలాల యువకులకు విక్రయిస్తున్నారు. సోమవారం ఉదయం టేకుమట్ల మండల కేంద్రానికి వస్తున్న క్రమంలో టేకుమట్ల రైతు వేదిక వద్ద వాహనాల తనిఖీలో వారి వద్ద 1.2కిలోల ఎండు గంజాయిని పోలీసులు గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకుని, ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై గైకవాడ అమూల్య తెలిపారు.

కాళేశ్వరాలయంలో టీపీసీసీ అధ్యక్షుడు పూజలు

కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామిని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్‌ గౌడ్‌ దంపతులు సోమవారం దర్శించుకున్నారు. ముందుగా త్రివేణి సంగమం వద్ద సైకత లింగార్చన, షోడస సోమవార వ్రత ఉద్యాపన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ రాజగోపురం వద్దకు రాగా అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారి గర్భగుడిలో విశేష పూజలు చేశారు. శ్రీ శుభానందదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనను స్వామి వారి శేష వస్త్రాలతో ఆలయ చైర్మన్‌ అవధాని మోహన్‌ శర్మ సన్మానించారు. ఆయన వెంట టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు, డీసీసీ అద్యక్షుడు బట్టు కర్ణాకర్‌ ఉన్నారు.

శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో..

రేగొండ: రేగొండ మండలంలోని సుప్రసిద్ధ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మహేష్‌కుమార్‌గౌడ్‌ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఆలయ కమిటీ చైర్మన్‌ నాయినేని సంపత్‌రావు శాలువాలతో ఘనంగా సన్మానించారు.

Advertisement
 
Advertisement
Advertisement