ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు | - | Sakshi
Sakshi News home page

ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు

May 5 2026 7:08 AM | Updated on May 5 2026 7:08 AM

భూపాలపల్లి: జిల్లాలో వరిధాన్యం కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయని, ప్రస్తుతం పీక్‌ దశలో కొనసాగుతున్నందున అంతరాయాలు లేకుండా సమర్థవంతంగా ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ అధికారులకు ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో పౌర సరఫరాలు శాఖ, సంస్థ, వ్యవసాయ, సహకార, డీఆర్‌డీఓ, మిల్లర్లు, ట్రాన్స్‌పోర్టర్లు, వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు, సౌకర్యాల పట్ల థర్డ్‌ పార్టీ పరిశీలనకు రెవెన్యూ, వ్యవసాయ అధికారులతో తనిఖీ నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 185 కేంద్రాలు ఏర్పాటు లక్ష్యం కాగా ఇప్పటివరకు 130 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని, మిగిలినవి త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. ఐదు పారా బాయిల్డ్‌ రైస్‌ మిల్లులకు 25 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కేటాయించామని, ఇప్పటివరకు 108 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగినట్లు తెలిపారు. ఈ సీజన్‌లో మొత్తం 1.60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌, డీసీఎస్‌ఓ కిరణ్‌కుమార్‌, డీఎం రాములు, డీఏఓ బాబూరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి..

అకాల వర్షాల పట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, రైతులకు నష్టం జరుగకుండా ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు పూర్తిచేయాలని రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రులు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, సివిల్‌ సప్లయీస్‌ అధికారులు పాల్గొన్నారు.

10 వరకు స్వీయ నమోదు

డిజిటల్‌ విధానంలో ప్రతీ ఒక్కరు జనగణన స్వీయ నమోదు నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ సూచించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో జనగణన స్వీయ నమోదుపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో గత నెల 26వ తేదీ నుంచి జనగణన స్వీయ నమోదు ప్రారంభమైందని, మే 10వ తేదీ వరకు జరుగుతుందని తెలిపారు.

దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు..

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ శర్మ సూచించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి 55 దరఖాస్తులు స్వీకరించారు. ఆ దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆయా జిల్లా శాఖల అధికారులను ఆదేశించారు.

డిజిటల్‌ విధానంలో స్వీయ నమోదు చేసుకోవాలి

కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

Advertisement
 
Advertisement
Advertisement