అడ్మిషన్ల వేట! | - | Sakshi
Sakshi News home page

అడ్మిషన్ల వేట!

May 4 2026 7:37 AM | Updated on May 4 2026 7:37 AM

ప్రవేశాల కోసం ‘కార్పొరేట్‌’ విద్యాసంస్థల ప్రయత్నాలు

మీ అమ్మాయిని మా కాలేజీలో చేర్పించడానికి ఇప్పుడే సీట్‌ బుక్‌ చేసుకోండి. మరికొద్ది రోజులైతే ఫీజు ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది.. అంటూ గత కొద్ది రోజులుగా వచ్చే విద్యాసంవత్సరం ఇంటర్మీడియేట్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం కార్పొరేట్‌ విద్యాసంస్థలు అడ్మిషన్ల వేట సాగిస్తున్నాయి. జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేస్తుండగా.. పదో తరగతి ఫలితాలు వెలువడడంతో తల్లిదండ్రులను కలిసి ప్రవేశాల ఎర వేస్తున్నాయి.

భూపాలపల్లి అర్బన్‌: విద్యా వ్యాపారంలో పోటీ పెరగడంతో కార్పొరేట్‌ విద్యాసంస్థలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. తమ సంస్థల్లో విద్యార్థుల ప్రవేశాలే లక్ష్యంగా పోటీ పడుతున్నాయి. జిల్లాలో సింగరేణి పరిధి కార్మిక, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు, వ్యాపారులు, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులను పలు రకాలుగా ఆకర్షిస్తున్నారు. తమ విద్యాసంస్థల్లో సౌకర్యాలను వివరిస్తూ ఇప్పుడే చేరిపోవాలంటూ కోరుతున్నారు. ఇప్పటికే కొందరు తల్లిదండ్రులు హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ తదితర ప్రాంతాల్లోని పలు కాలేజీలను సందర్శించి వచ్చారు. ఇంకా చాలామంది వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంటర్‌తో పాటు ఐఐటీ, నీట్‌, సివిల్స్‌ ఇతర ఉన్నత విద్య ప్రవేశాల శిక్షణతో సహా ఇంటర్మీడియేట్‌ విద్యను అందిస్తామని హామీలు ఇస్తున్నారు. తమ విద్యాసంస్థల్లో అనేకమంది ఐఐటీ, ఎన్‌ఐటీ, నీట్‌ ర్యాంకులు సాధించారని చెబుతూ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తల్లిదండ్రులకు ఫోన్లు, మెసేజ్‌లు, వాట్సాప్‌లో ప్రచారం చేస్తున్నారు.

ప్రవేశాలకు కమీషన్లు

ఆయా సంస్థలు విద్యార్థుల అడ్మిషన్లను బట్టి కమీషన్లు ఇస్తున్నాయి. పీఆర్వోలను నియమించుకుని విద్యార్థుల ఇళ్లకు నేరుగా వెళ్తున్నారు. రూ.లక్షల్లో ఫీజులు చెబుతూ వాయిదాలు, ఫైనాన్స్‌ సౌకర్యం కూడా కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నత విద్యాసంస్థల్లో చదివితే భవిష్యత్‌లో అవకాశాలు మెరుగు పడతాయనే ఆశతో ఫీజులు చెల్లించేందుకు ఒప్పుకుంటున్నారు. ఎక్కువగా హాస్టల్‌లో చేర్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పదో తరగతికి మార్కులు అధికంగా వచ్చిన విద్యార్థులను వేరే కేటగిరీలో చేర్చుతూ తల్లిదండ్రులను మెప్పిస్తున్నారు. పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులతోనూ ప్రచారం చేయిస్తున్నారు. జిల్లాలో పదో తరగతి విద్యార్థులు మూడు వేలకు పైగా ఉండగా, ఇంకా అనేక మంది ఇతర జిల్లాల్లోనూ చదివారు. ఎక్కువగా హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌తోపాటు ఇతర నగరాల్లో ఉన్న సంస్థలు అడ్మిషన్లు పొందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో స్థానికంగా ఉన్న చిన్న, మధ్య స్థాయి కాలేజీల పరిస్థితి భిన్నంగా మారింది. దీంతో ప్రభుత్వ విద్యాసంస్థలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ప్రైవేట్‌ సంస్థలతో పోటీ పడలేక ఏటేటా అడ్మిషన్ల సంఖ్య తగ్గిపోతోంది. మరోవైపు స్కూల్‌ విద్యార్థులను సైతం చేరికకు ప్రైవేట్‌ విద్యాసంస్థలు పోటీ పడుతున్నాయి. ప్రీ కిడ్స్‌ నుంచి మొదలు పది వరకు, ఎస్‌ఎస్సీ, సీబీఎస్‌ఈ, ఇంటర్నేషనల్‌ సిలబస్‌ అంటూ అనేక స్కూళ్ల యాజమాన్యాలు ప్రచారం మొదలుపెట్టాయి. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి స్కూళ్లు మూతపడే పరిస్థితి వస్తోంది. సెలవులకు ముందు ప్రభుత్వ టీచర్లు అడ్మిషన్ల కోసం ప్రచారం చేసినప్పటికీ ప్రస్తుతం చేయడం లేదు. ఇదే సమయంలో ప్రైవేట్‌ సంస్థలు విస్తృతంగా ప్రచారం చేస్తూ విద్యార్థులను చేర్పించుకుంటున్నాయి.

జిల్లా విద్యార్థులే లక్ష్యంగా ప్రచారం

సీట్ల కోసం ముందస్తుగానే

ఫీజు చెల్లింపులు

Advertisement
 
Advertisement
Advertisement