భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలో రెండు పరీక్ష కేంద్రాలలో నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా నిర్వహించినట్లు సిటీ నీట్ కోఆర్డినేటర్ డాక్టర్ రమణారావు తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 134 మంది విద్యార్థులకు 132మంది విద్యార్థులు హాజరుకాగా ఇద్దరు గైర్హాజరయ్యారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 240 మంది విద్యార్థులకు గాను 232 మంది హాజరు కాగా ఎనిమిది మంది గైర్హాజరైనట్లు కోఆర్డినేటర్ తెలిపారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా పకడ్బందీగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 11 గంటల నుంచి విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నట్లు తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను తనిఖీ చేసిన అనంతరం పరీక్ష హాల్‌లోని అనుమతించారు.
ఆలస్యంగా వచ్చిన విద్యార్థి
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పా టు చేసిన నీట్ పరీక్షకు సకాలంలో హాజరుకాని వి ద్యార్థినిని అధికారులు పరీక్షకు అనుమతించలేదు. మహదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామానికి చెందిన లావుడియా వీణ పరీక్షకు 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. మధ్యాహ్నం 1.30గంటలకు పరీక్ష ప్రారంభం కాగా 1.40గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకుంది. పోలీసులు పరీక్ష కేంద్రానికి అనుమతించకపోవడంతో బోరున విలపిస్తూ ఇంటికి తిరిగి వెళ్లింది. పరీక్షకు అనుమతించాలని ఇప్పటివరకు చదివిన చదువు వృథా అవుతుందని అధికారులను వేడుకున్నా పరీక్షకు అనుమతించలేదు.


