పూర్తయ్యేదెప్పుడో? | - | Sakshi
Sakshi News home page

పూర్తయ్యేదెప్పుడో?

May 3 2026 7:35 AM | Updated on May 3 2026 7:35 AM

జిల్లా కేంద్రంలో తీవ్రమవుతున్న

ట్రాఫిక్‌ సమస్య

ఇష్టారాజ్యంగా పార్కింగ్‌ స్థలాలు, వాకింగ్‌ పాత్‌లు కబ్జా

ఇబ్బందుల్లో పాదాచారులు,

వాహనదారులు

భూపాలపల్లి: రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న జిల్లా కేంద్రంలో రహదారుల విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. జంక్షన్ల అభివృద్ధి ఊసే లేకపోవడంతో ట్రాఫిక్‌ సమస్య తీవ్రతరం అవుతుంది. వ్యాపారులు రహదారులను సైతం కబ్జా చేస్తుండటంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రోడ్డంతా మాదే..

పట్టణంలోని జాతీయ రహదారిలో ఉన్న వ్యాపారులు కబ్జాలకు పాల్పడుతుండటంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని హనుమాన్‌ దేవాలయం నుంచి జయశంకర్‌ చౌరస్తా వరకు ఉన్న షాపులకు చెందిన పలువురు యజమానులు తమ సామగ్రిని పార్కింగ్‌ స్థలాలు, ఫుట్‌పాత్‌లపై ఉంచి ప్రదర్శిస్తున్నారు. దీంతో ద్విచక్ర వాహనాలు సైతం పార్కింగ్‌ చేయలేని పరిస్థితి నెలకొంటుంది. మహిళలు, చిన్నారులు నడిచేందుకు స్థలం లేక జాతీయ రహదారిపై నడుస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. రోడ్డు పొడవునా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నా మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నత్తనడకన సాగుతున్న పనులు

భూపాలపల్లి పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తా నుంచి సుభాష్‌కాలనీ రామాలయం వరకు బీటీ రోడ్డు, సెంట్రల్‌ లైటింగ్‌, ఇరువైపులా డ్రెయినేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ పనులకు రూ.3.50 కోట్లు మున్సిపాలిటీ, రూ.4 కోట్లు ఆర్‌అండ్‌బీ నిధులు కేటాయించగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. సుమారు రెండేళ్ల క్రితం ఈ అభివృద్ధి పనులు ప్రారంభం కాగా ఇప్పటి వరకు కొంతమేరకు మాత్రమే రోడ్డు నిర్మాణం, డ్రెయినేజీ పనులు పూర్తయ్యాయి. దీంతో పట్టణంలోని రెడ్డికాలనీ, ఎల్‌బీ నగర్‌, సుభాష్‌కాలనీ, గాంధీనగర్‌, రాంనగర్‌ కాలనీతో పాటు విలీన గ్రామాలైన కాశీంపల్లి, గడ్డిగానిపల్లి, సెగ్గంపల్లి, జంగేడు, వేశాలపల్లి తదితర గ్రామాల వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డిగ్రీ కళాశాల ఆవరణ సమీపంలో ప్రతీ గురువారం వారసంత జరుగుతుండటంతో తీవ్ర ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. పలు షాపుల యాజమానుల అభ్యంతరాల మూలంగానే పనులు నిలిచిపోయినట్లు తెలుస్తోంది.

కబ్జాలపై చర్యలు తీసుకుంటాం..

పట్టణంలోని ప్రధాన రహదారి వెంట షాపుల ఎదుట సైడ్‌ కాలువలు, ఫుట్‌పాత్‌లు, పార్కింగ్‌ స్థలాలపై వ్యాపారులు ఏర్పాటు చేసిన సామగ్రిని తొలగిస్తాం. వ్యాపారులకు నోటీసులు జారీ చేసి పాదాచారులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం. జంక్షన్ల అభివృద్ధికి సంబంధించి టెండరు ప్రక్రియ కొనసాగుతోంది.

– ఉదయ్‌కుమార్‌,

భూపాలపల్లి మున్సిపల్‌ కమిషనర్‌

నత్తనడకన రహదారుల విస్తరణ పనులు

ఠాణా వైపు రోడ్డు విస్తరణ ఎప్పుడో..

పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తా నుంచి క్రిష్ణాకాలనీ వైపు వెళ్లే రహదారి చాలా ఇరుకుగా ఉంది. ఆ రహదారిలో సింగరేణి జీఎం కార్యాలయం, జిల్లా పోలీసు కార్యాలయం, పోలీస్‌స్టేషన్‌, అంబేడ్కర్‌ క్రీడా మైదానం, కేటీకే 6వ గనితో పాటు పలు కాలనీలు ఉన్నాయి. దీంతో ఈ రోడ్డు మీదుగా ప్రతీరోజు వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రహదారి విస్తరణ, డ్రెయినేజీ నిర్మాణ పనులు చేపడుతామని అధికారులు, ప్రజాప్రతినిధులు అనేకమార్లు ఏళ్ల తరబడి ప్రకటిస్తున్నారు. అయినా పనుల ప్రణాళిక కూడా రూపొందలేదు. దీంతో వాహనదారులు ట్రాఫిక్‌ సమస్యను ఎదుర్కోవడమే కాక, అటువైపుగా హోటళ్లు, చికెన్‌ సెంటర్ల యాజమానులు డ్రెయినేజీలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement