కేయూ క్యాంపస్: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకుగాను దేశవ్యాప్తంగా ఈ నెల 3న నిర్వహించనున్న నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్టు (నీట్)– 2026కు ఉమ్మడి జిల్లాలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తంగా 14 కేంద్రాల్లో కలిపి 6,016మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులను ఉదయం 11గంటల నుంచే సెంటర్‌లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1–30గంటలకు మెయిన్ గేట్లను మూసివేస్తారు. ఆ తరువాత వచ్చేవారికి అనుమతించబోరు. దివ్యాంగ అభ్యర్థులకు పరీక్ష రాసేందుకు అదనంగా గంట సమయం ఇస్తారు. ఆయా అభ్యర్థులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష ఉంటుంది. హనుమకొండ, వరంగల్‌లోని పరీక్ష కేంద్రాల్లో ఐదుగురు స్క్రైబర్స్‌ను కూడా అందుబాటులో ఉంచుతున్నట్లు రెండు జిల్లాల నీట్ నోడల్ ఆఫీసర్ భిక్షపతి తెలిపారు.
నిబంధనలు కఠినం..
● అభ్యర్థులు అడ్మిట్ కార్డుతోపాటు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, 4x6 సైజ్ ఫొటో ఒకటి, ఏదైనా గుర్తింపుకార్డు వెంట తీసుకుని రావాలి.
● పన్ను, పెన్సిల్ తీసుకురావొద్దు. వీటిని పరీక్ష కేంద్రాల్లోనే అందజేస్తారు.
● బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకుంటారు.
● ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, వాచ్‌లు తీసుకురావొద్దు,
● మహిళలు బంగారు నగలు పెట్టుకొని రాకూడదు. ఒకవేళ పెట్టుకుని వస్తే కేంద్రం వద్ద తీసివేయిస్తారు.
● కాళ్లకు షూస్ ధరించకూడదు. జీన్స్‌లాంటివి గాకుండా సాధారణ దుస్తులు ధరించి రావాలి.
● పారదర్శకంగా ఉండే వాటర్ బాటిల్స్‌ను తీసుకురావచ్చు.
● డయాబెటిక్ కలిగిన అభ్యర్థులుంటే వారు పండ్లు (అరటి, యాపిల్) తీసుకొని రావచ్చు.
● ప్రతి గదిలో, మెయిన్ గేట్‌వద్ద అందరికీ కనిపించేలా గడియారాలు ఏర్పాటు చేస్తారు.
ఉమ్మడి జిల్లాలో పరీక్షకేంద్రాలు ఇలా..
● వరంగల్ నిట్‌లో రెండు సెంటర్లు, హనుమకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీకళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో ఎడ్యుకేషన్), వరంగల్‌లో సీకేఎం కళాశాల, ఎల్‌బీ కళాశాల, కేంద్రీయ విద్యాలయం, యూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్ సైన్స్ కళాశాల, యూనివర్సిటీ పీజీ కళాశాల
● జయశంకర్ భూపాలపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో), ప్రభుత్వ జూనియర్ కళాశాల
● జనగామ జిల్లా కేంద్రంలోని ఏవీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పెంబర్తిలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల విద్యాలయం
● మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోగల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల
● మహబూబాబాద్‌లో నీట్ నోడల్ ఆఫీసర్‌గా కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ ముఖేశ్‌కుమార్ వ్యవహరించనున్నారు.
జిల్లా సెంటర్లు అభ్యర్థులు
హనుమకొండ, వరంగల్ 09 4,600
జయశంకర్ భూపాలపల్లి 02 374
జనగామ 02 566
మహబూబాబాద్ 01 476
నిబంధనలు అమలు..
ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
భూపాలపల్లి: నీట్ నిర్వహణ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 3వ తేదీన(రేపు) జరుగనున్న నీట్ సందర్భంగా 163 బీఎన్‌ఎస్‌ఎస్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్ష రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఈ నిబంధనలు అమల్లో ఉంటాయన్నారు. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి గుంపులుగా నిలవడం నిషేధమని, సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, ప్రచారాలు నిర్వహించరాదన్నారు. మైకులు, డీజేలు వినియోగించడం పూర్తిగా నిషేధమని, పరీక్ష సమయంలో ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ సెంటర్లు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వాచీలు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దని సూచించారు. జిల్లా కేంద్రంలోని రెండు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు చర్యలు చేపడుతామని ఎస్పీ సంకీర్త్ అన్నారు.


