● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
● స్వీయ జనగణనలో ప్రతీ ఒక్కరు పాల్గొనాలి
● కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి: రైతులకు ఇబ్బందులు కలగకుండా మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులకు సూచించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో మార్క్‌ఫెడ్, మార్కెటింగ్, రవాణా, సహకార, పౌర సరఫరాలు, సంస్థ, వ్యవసాయ తదితర శాఖల అధికారులతో మొక్కజొన్న కొనుగోలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లాలో సుమారు 49,175 హెక్టార్లలో మొక్కజొన్న సాగు జరగగా.. ఇప్పటివరకు 3,274 క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేసినట్లు చెప్పారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ఏడు కొనుగోలు కేంద్రాల్లో గోదాం, హమాలీ, రవాణా సమస్యలు రాకుండా చూసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
స్వీయ జనగణనలో పాల్గొనాలి..
స్వీయ జనగణనలో ప్రతీ ఒక్కరు నమోదు చేసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జిల్లాలో ఏప్రిల్ 26వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు జరుగనున్న స్వీయ జనగణన కార్యక్రమంపై శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, సీపీఓ జవహర్, ఆర్డీఓ హరిక్రిష్ణ, అధికారులు పాల్గొన్నారు.
సమావేశానికి ఏర్పాట్లు చేయాలి..
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించనున్న నియోజకవర్గ స్థాయి సమావేశానికి అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై శుక్రవారం ఐడీఓసీ సమావేశం నిర్వహించారు.
ఫార్మర్స్ వీక్ కార్యక్రమం
విజయవంతం చేయాలి..
ఫార్మర్స్ వీక్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్‌రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో కలిసి శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వంచారు. ఈ కాన్ఫరెన్స్‌కు జిల్లా నుంచి కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


