మళ్లీ పుష్కర శోభ | - | Sakshi
Sakshi News home page

మళ్లీ పుష్కర శోభ

May 1 2026 5:57 AM | Updated on May 1 2026 5:57 AM

మళ్లీ పుష్కర శోభ

ఏర్పాట్లలో అధికారులు

నిమగ్నం..

21నుంచి సరస్వతీనది అంత్యపుష్కరాలు

కాళేశ్వరం: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక కాంతులతో మళ్లీ వెలుగులు విరజిమ్మనున్నాయి. సరస్వతీనది అంత్యపుష్కరాలు ఈనెల 21 నుంచి జూన్‌ 1 వరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. సుమారుగా 30లక్షల మంది భక్తులు వస్తారని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. కంచి పీఠాధిపతి, గవర్నర్‌ ప్రతాప్‌శుక్లా, సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభపూజల్లో పాల్గొననున్నారని సమాచారం. దీంతో 12 రోజుల పాటు ఆధ్యాత్మిక శోభ నెలకొననుంది.

సమన్వయంతో పనిచేస్తున్న శాఖలు

రాష్ట్ర ప్రభుత్వం రూ.21.38 కోట్ల విడుదల చేయగా.. అధికార యంత్రాంగం తాత్కాలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లతో బిజీగా ఉంది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. భక్తులకు తాగునీరు, వైద్యశిబిరాలు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్‌ నియంత్రణ వంటి ఏర్పాట్లు విస్తృతంగా చేపడుతున్నారు. ప్రస్తుతం రూ.1.20కోట్ల వ్యయంతో మ్యూజియం, వీఐపీఘాటు వద్ద ప్లాట్‌ఫామ్‌ పనులు, రూ.2కోట్ల వ్యయంతో నల్లగొండ పోచమ్మ గుడి నుంచి వీఐపీఘాటు వరకు రోడ్డు పనులు, ఆదిముక్తీశ్వరాలయం వద్ద సీసీ రోడ్డు, వీఐపీ ఘాటు నుంచి మెయిన్‌ ఘాటు వరకు రోడ్డు నిర్మాణం పనులు చేపట్టారు.

12 రోజులు హారతి కార్యక్రమాలు..

గతేడాది జరిగిన సరస్వతి ఆదిపుష్కరాల్లో నిర్వహించిన కాశీపండితులతో మళ్లీ అంత్య పుష్కరాలకు గోదావరివద్ద హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. 12 రోజుల పాటు ఎనిమిది మంది బృందంతో హారతి శోభతో వెలిగిపోనుంది. వారి రాక కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 12 రోజుల పాటు ఆలయంలో హోమాలు ప్రత్యేకంగా చేపడుతున్నారు. 12 రోజుల పాటు రుద్రాభిషేకం పూజలు నిర్వహిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

పీఠాధిపతులు..

ఆది పుష్కరాల మాదిరిగానే అంత్యపుష్కరాలకు పలువురు పీఠాధిపతులు రానున్నారు. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిణి సరస్వతీనదిలో పుణ్యస్నానాలు చేసి శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకుంటారు. వారి రాకకోసం దేవాదాయశాఖ ఏర్పాట్లు చేపట్టింది. 12 రోజుల పాటు రాష్ట్రంలోని మంత్రులు, ఎంపీలు, ఉన్నతాధికారులు పుణ్యస్నానాలు చేయనున్నారు. ఆలయంలో దర్శనాలు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు..

వచ్చే ఏడాది జూన్‌ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి నదికి పుష్కరాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాళేశ్వరంలో గొప్పగా నిర్వహించడానికి ఇప్పటికే రూ.198 కోట్ల వ్యయంతో రాతి కట్టడాలు నిర్మాణం చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఇవి కాకుండా పుష్కరాలకు మరిన్ని నిధులు రానున్నాయి. దీంతో మరోమారు వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలకు వేదిక కానుంది.

రూ.21.38కోట్ల నిధులు మంజూరు.. పనులు చేపట్టిన ప్రభుత్వం

12 రోజులు హారతి, హోమాలు,

పీఠాధిపతుల రాక

ఏర్పాట్లలో నిమగ్నమైన

అధికార యంత్రాంగం

లక్షలాదిగా తరలి రానున్న భక్తులు

రాష్ట్ర దేవాదాయశాఖ అధికారులతో పాటు స్థానిక అధికారులు ఏర్పాట్లు చేపట్టడంలో నిమగ్నమయ్యారు. బుధవారం మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజారామయ్యర్‌ అంత్యపుష్కరాల వాల్‌పోస్టర్‌, టీజర్‌ వీడియోను ఆవిష్కరించారు. దీంతో విస్తృతంగా పబ్లిసిటీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వీవీఐపీల కోసం హెలిప్యాడ్‌ సిద్ధం చేస్తున్నారు. 100 ఎకరాల్లో ట్రాఫిక్‌ నియంత్రణకు అంతర్రాష్ట్ర వంతెన, వీఐపీ ఘాటు సమీపం, ఎస్సీకాలనీ వద్ద పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేస్తున్నారు. సరస్వతీమాత విగ్రహం వద్ద డెకరేషన్‌ ఏర్పాట్లు చేపట్టనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement