రైతులకు ప్రత్యేక జాగ్రత్తలు
● నేటి నుంచి విద్యుత్ భద్రతా వారోత్సవాలు
హన్మకొండ: విద్యుత్ వినియోగంలో భద్రతపై అవగాహన పెంపొందించేందుకు మే 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు టీజీ ఎన్పీడీసీఎల్ పరిధి 18 సర్కిళ్లలో విద్యుత్ భద్రత వారోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్‌రెడ్డి తెలిపారు. విద్యుత్ వారోత్సవాలను పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ.. 18 సర్కిళ్లకు నియమించిన నోడల్ అధికారులు వినియోగదారులకు, రైతులకు విద్యుత్ భద్రతపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతీ అధికారి క్షేత్ర స్థాయిలో పర్యటించి, సమావేశాలు నిర్వహించి విద్యుత్ భద్రతపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ ప్రమాదాలను జీరో స్థాయికి తీసుకురావడమే ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. విద్యుత్ వినియోగంలో నిర్లక్ష్యం, అజాగ్రత్త, అలసత్వం కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటి నివారణకు స్వీయ నియంత్రణ ముఖ్యమని స్పష్టం చేశారు.
ప్రధాన కారణాలివే..
● నిర్లక్ష్యంగా విద్యుత్ పరికరాల వినియోగం, పాడైన, నాసిరకం, అతుకుల వైర్ల వినియోగం, ఎర్తింగ్ లేకపోవడం, తడిసిన చేతులతో విద్యుత్ పరికరాలను ముట్టుకోవడం.
● తెగిన విద్యుత్ తీగలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకొద్దు. వెంటనే అధికారులకు సమాచారమివ్వాలి.
● తడి చేతులతో స్విచ్‌లు, పరికరాలు ఆపరేట్ చేయవద్దు. గృహాల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో సరైన ఎర్తింగ్ వ్యవస్థ ఉండాలి.
● మీటర్లు, సర్వీస్ వైర్లు, స్విచ్ బోర్డులు మధ్యమధ్యలో తనిఖీ చేయించుకోవాలి.
● చిన్నపిల్లలను విద్యుత్ పరికరాలకు దూరంగా ఉంచాలి.
విద్యుత్ భద్రతపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నాం. గ్రామాలు, పట్టణాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. వాల్‌పోస్టర్లు, కరపత్రాల పంపిణీ ద్వారా ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నాం. విద్యుత్ శాఖ సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ప్రమాదకర లైన్లు, వంగిన విద్యుత్ స్తంభాలు, పాత వైర్లను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపడుతున్నాం. ప్రజలు జాగ్రత్తలు పాటించి, ఎలాంటి ప్రమాద సూచనలు గమనించిన వెంటనే విద్యుత్ శాఖకు సమాచారం ఇవ్వాలి. 24/7 పనిచేసే 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి విద్యుత్ సమస్యలు పరిష్కరించుకోవాలి.
– కర్నాటి వరుణ్ రెడ్డి, టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ
మోటార్ స్టార్టర్ల వద్ద ఇన్సులేషన్ సరిగ్గా ఉండాలి. తడి నేలపై నిలబడి స్విచ్ ఆన్ చేయొద్దు.
విద్యుత్ లైన్లకు సమీపంలో నీటి పైపులు, లోహ పరికరాలు ఉపయోగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.


