దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి అర్బన్: వివిధ ట్రేడ్‌లలో ఐటీఐ (ఎన్‌సీవీటీ) అప్రెంటిస్‌షిప్ శిక్షణకు సింగరేణి యాజమాన్యం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్‌ఏపీసీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. ఎన్‌ఏపీఎస్ పోర్టల్‌లో నమోదై ఉంటేనే ఎస్‌సీసీఎల్ పోర్టల్ రిజిస్ట్రేషన్ చెల్లుబాటు అవుతుందని తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 25వ తేదీలోపు www. apprenticeshipindia. org వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆన్‌లైన్ దరఖాస్తు జిరాక్స్ సెట్‌ను వీటీసీ కార్యాలయంలో అందించాలని తెలిపారు.
భూపాలపల్లి అర్బన్: జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 21న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి నాగరాజ్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో స్థానిక న్యాయవాదులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీమార్గాన్ని ఎంచుకొని వివాదరహిత జీవితాలను గడిపేలా కక్షిదారులను ప్రోత్సహించాలని సూచించారు. రాజీమార్గం ద్వారా అధిక సంఖ్యలో కేసులు పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. జూనియర్ సివిల్ జడ్జి ఎస్‌ఆర్ దిలీప్‌కుమార్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసచారి, డీప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అక్షయ, న్యాయవాదులు పాల్గొన్నారు.
భూపాలపల్లి అర్బన్: 56వ వార్షిక భద్రత పక్షోత్సవాలు ఏరియాలో కొనసాగుతున్నాయి. ఈ మేరకు గురువారం ఏరియాలోని కేటీకే 6వ గనిలో భద్రత తనిఖీ బృందం పర్యటించారు. ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డి, భద్రత కమిటీ కన్వీనర్ శ్రీనాథ్ హాజరై ఉద్యోగులకు భద్రత చర్యలు, ప్రమాదాల నివారణ గురించి వివరించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు లక్ష్మణ్, రాధాకృష్ణ, అఫ్సర్‌పాషా, కిరణ్‌కుమార్, అమర్‌నాథ్, శ్రీనివాసరావు, ఏరియా అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
భూపాలపల్లి అర్బన్: 2026 మార్చి 14వ తేదీ నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏప్రిల్ 16వ తేదీ వరకు పరీక్షలు కొనసాగుతాయని తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల పరీక్ష ఉంటుందని తెలిపారు. భౌతిక, జీవశాస్త్రలకు మాత్రం ఉదయం 11 గంటల వరకు ఉంటుందన్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రతి పరీక్షకు 4 నుంచి 5 రోజుల వ్యవధి ఉంటుందని విద్యార్థు ఈ విరామ సమయాన్ని వినియోగించుకుని పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించాలని తెలిపారు.
కాటారం : మండలంలోని గంగారం గ్రామానికి చెందిన బొమ్మన జైపాల్‌రెడ్డి రాజేశ్వరికావ్యల కూతురు శ్లోక ఫాల్గునరెడ్డి విభిన్న రంగాల్లో బహుముఖ ప్రతిభ కనబరుస్తూ మన్నలను పొందుతుంది. క్రీడలు, కళలు, వ్యక్తిత్వ అభివృద్ధి రంగాల్లో తనదైన ప్రతిభ చాటుతూ ముందుకెళ్తుంది. తాజాగా శ్లోక ఫాల్గునరెడ్డి బీసీసీఐ అండర్–19 వన్‌డే మహిళా క్రికెట్ జట్టులో చోటు దక్కించుకుంది. ఈ నెల 13 నుంచి ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరగనున్న మహిళల వన్‌డే క్రికెట్ టోర్నమెంట్‌లో హెచ్‌సీఏ తెలంగాణ జట్టు తరఫున ఆడనుంది. గతంలో ఆమె లక్నోలో జరిగిన జాతీయ స్థాయి అండర్–14 మహిళా క్రికెట్ ఫైనల్లో ఉమ్మడి తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. శ్లోక ఫాల్గునరెడ్డి కేవలం క్రికెట్‌లోనే కాకుండా చెస్ జాతీయ స్థాయి పోటీల్లో, త్రోబాల్ రాష్ట్రస్థాయి పోటీల్లో విజయం సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చిన శ్లోక ఫాల్గునరెడ్డి నాట్య మయూరి ఇంటర్నేషనల్ అవార్డును అందుకోవడంతోపాటు 2024లో మిస్ హైదరాబాద్ టైటిల్‌ను గెలుచుకుంది. శ్లోక ఫాల్గునరెడ్డి మహిళా క్రికెట్ జట్టుకు ఎంపికవడంపై తల్లిదండ్రులతోపాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.
దరఖాస్తుల స్వీకరణ


