
క్లైమాక్స్‌కు ‘దత్తత దందా’
సాక్షి, వరంగల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందా’ విచారణ క్లైమాక్స్‌కు చేరుకుంది. ఇటు పోలీసులు, అటు అధికారులు వేర్వేరుగా చేసిన విచారణ నివేదికల ఆధారంగా కలెక్టర్ సత్యశారద ఆదేశాలకు అనుగుణంగా బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశముంది. ఇప్పటికే గతంలో నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లతో జిల్లా సంక్షేమ విభాగంలోని వీహబ్‌లో ఉద్యోగం పొంది ఏడాదికిపైగా విధులు నిర్వర్తించిన సిక్కుల సుజాతపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లుగానే దత్తత వ్యవహారంలో నకిలీ బర్త్ సర్టిఫికెట్లతో సంబంధమున్న సిబ్బందిపై కూడా చట్టపరమైన చర్యలకు అవకాశముంది. ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు అధికారే, కొన్ని నెలల క్రితం ఓ దత్తత విషయంలో నిబంధనలు అతిక్రమించి మెమో అందుకున్నా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ ‘మంత్రి’ దగ్గరికి వెళ్లి జిల్లా పాలనాధికారిపై ఒత్తిడి తెచ్చి ఉద్యోగం పోకుండా చూసుకున్నారనే ప్రచారం ఉంది. ఈసారి కూడా నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం తన మెడకు చుట్టుకుంటుందనే ఉద్దేశంతో మరోమారు సదరు మంత్రితోపాటు ఓ ఎమ్మెల్యే నుంచి కలెక్టర్‌పై ఒత్తిడి తెచ్చి ఈ విచారణను నీరుగార్చేలా చేశారనే టాక్ ఉంది. ఈ కేసు విషయంలో కలెక్టర్ సత్యశారద పారదర్శక విచారణ నివేదిక తెప్పించుకుంటున్నా.. ఆలోపే బ్రేక్ వేయాలనుకుంటుండడం గమనార్హం. నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంలో కలెక్టర్ ఏ నిర్ణయం తీసుకుంటున్నారనేది అసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ దందాలో 8 మందిని పోలీసులు విచారించారు. అసలే పాఠశాల లేని, అది కూడా నర్సంపేట కేంద్రంగా నకిలీ సర్టిఫికెట్లు రూపొందించడంతో విస్మయం చెందారు.
డాటా ఎంట్రీ ఆపరేటర్ ఈమెయిల్
ఇవ్వడంపై అనుమానాలు..
నకిలీ సర్టిఫికెట్ల దందాపై రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ విభాగం డైరెక్టరేట్ కార్యాలయం నుంచి విచారణ చేసి వెంటనే నివేదిక సమర్పించాలని వచ్చిన సంబంధిత విభాగాధికారులు పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కారా నిబంధనల ప్రకారం దత్తత కోరుకునే దంపతుల దరఖాస్తు సమయంలో వారి ఈమెయిల్ ఐడీ ఇవ్వాలి. లేదంటే ఆఫీస్ మెయిల్ ఐడీ కూడా ఇవ్వొచ్చు. అయితే వీరు మాత్రం పాప రావడానికి ఎంత వరుసలో ఉన్నాం, ఇంకెంత మంది ముందున్నారు, పాప రెఫరల్ వచ్చే సమాచారం కోసం సదరు అధికారితోపాటు అప్పుడు ఈ విభాగంలో పనిచేసే ఓ డాటా ఎంట్రీ ఆపరేటర్ వ్యక్తిగత ‘ఈ–మెయిల్స్’ ఇవ్వడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. కారా నుంచి వచ్చే సమాచారం తమ మెయిల్‌కు రాగానే మీకు పాప మరో వారం రోజల్లో వస్తుంది, మాకేం చేస్తారనే మాటమంతీ జరిగి ఉండొచ్చని విచారణ చేసిన పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. అలాగే, విచారణ జరుగుతుండగానే బాలరక్షా భవన్‌లో పనిచేస్తున్న నర్సంపేటకు చెందిన ఓ వ్యక్తి ఉద్యోగానికి రాజీనామా చేశారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అతడి పాత్రపై కూడా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఎందుకంటే ఏడు నకిలీ సర్టిఫికెట్లు నర్సంపేట నుంచి రావడంతో పోలీసులకు మరిన్ని అనుమానాలు బలపడేలా చేసింది. గతంలోనే చైల్డ్ హెల్ప్‌లైన్‌లో నకిలీ అనుభవ సర్టిఫికెట్ ఇచ్చి అర్హత జాబితాలో ఎక్కడో మూలకు ఉన్నా కూడా అక్కడి అధికారుల అండదండలతో ఉద్యోగం పొందారన్న ఆరోపణలున్నాయి.
త్వరలో కలెక్టర్‌కు నివేదిక..
దత్తత దందాపై జిల్లా రెవెన్యూ అధికారి నివేదిక మేరకు కలెక్టర్ చర్యలు తీసుకుంటారు. ఈ నివేదిక ఒకటిరెండు రోజుల్లో కలెక్టర్ వద్దకు చేరుతుంది. అలాగే, బాలరక్షాభవన్‌లో చైల్డ్ హెల్ప్‌లైన్ విభాగంలో పనిచేసే ఓ ఉద్యోగి రాజీనామా అంశాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాకే తదుపరి నిర్ణయం ఉంటుంది.
– రాజమణి, వరంగల్ జిల్లా
సంక్షేమ విభాగాధికారి
8 మందిని విచారించిన వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు
అసలు లేని పాఠశాల నుంచి
నకిలీ బర్త్ సర్టిఫికెట్లపై విస్మయం
ఓవైపు విచారణ.. మరోవైపు ఓ ఉద్యోగి
రాజీనామాతో అనుమానాలు