మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి | - | Sakshi
Sakshi News home page

మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి

May 22 2025 12:57 AM | Updated on May 22 2025 12:57 AM

మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి

మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి

హన్మకొండ: కేంద్ర ప్రభుత్వం తాత్సారం వీడి వెంటనే మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని శాంతి చర్చల కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ చంద్ర కుమార్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని హోటల్‌ హరిత కాకతీయలో శాంతి చర్చల కమిటీ ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో జైసింగ్‌ రాథోడ్‌ అధ్యక్షతన ప్రజా సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జస్టిస్‌ చంద్ర కుమార్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మధ్య భారతదేశంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరుగుతున్న అంతర్‌ యుద్ధంలో సామాన్య ప్రజలు, అమాయక ఆదివాసీలు చనిపోతున్నారన్నారు. రాజ్యం తరఫున పోలీసులు సైతం మరణించి మధ్య భారతమంతా నెత్తురోడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మారణహోమాన్ని గమనించిన శాంతి చర్చల కమిటీ చేసిన అభ్యర్థన మేరకు మావోయిస్టు పార్టీ కాల్పులు విరమణ చేసి శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించిందన్నారు. కేంద్రం స్పందించకుండా దాడులను మరింత పెంచి సామాన్యులను సైతం చంపేస్తోందని, కాల్పుల విరమణ స్థితిలో ఉన్నవాళ్లను చుట్టుముట్టి చంపడం దుర్మార్గమని విమర్శించారు. ఇప్పటికై నా మావోయిస్టులతో శాంతి చర్చలు జరపడానికి ప్రధాని మోదీ, హోం మంత్రి వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం శాంతి చర్చల కమిటీ రాష్ట్ర సభ్యుడు సోమ రామ్మూర్తి, ఆల్‌ ఇండియా ఓబీసీ జాక్‌ చైర్మన్‌ సాయిని నరేందర్‌, ప్రొఫెసర్‌ కూరపాటి వెంకటనారాయణ, సిద్ధబోయిన లక్ష్మీనారాయణ, చుంచు రాజేందర్‌, అనిక్‌ సిద్ధికి, చిల్ల రాజేంద్రప్రసాద్‌, బొట్ల భిక్షపతి, ప్రొఫెసర్‌ అన్వర్‌ ఖాన్‌ మాట్లాడారు. కార్యక్రమంలో న్యాయవాదులు అబ్దుల్‌ నబీ, పండుగ శ్రీనివాస్‌, ఆదినారాయణ, దొమ్మటి ప్రవీణ్‌ కుమార్‌, కొండ్ర నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు.

శాంతి చర్చల కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ చంద్ర కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement