
సరస్వతి నదిలో మూడోరోజు లక్షన్నర మంది స్నానాలు
నదీహారతికి భక్తుల తాకిడి..
సరస్వతి ఘాట్‌లో రాత్రి కాశీపండితులు ఏర్పాటు చేసిన నవరత్నమాలిక (నదీహారతి) హారతికి భక్తులు భారీగా వచ్చారు. ఏడు గద్దెలపై ఏర్పాటు చేసిన విద్యుత్ వెలుగుల్లో ప్రత్యేకంగా తొమ్మిది హారతులు ఇచ్చారు.
భూపాలపల్లి/కాళేశ్వరం: సరస్వతి నదికి జనం పుష్కర హారతి పట్టారు. సరస్వతి నది పుష్కరాల్లో భాగంగా శనివారం మూడో రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి భారీగా భక్తులు కాళేశ్వరానికి పోటెత్తారు. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతి నదిలో పుష్కర పుణ్యస్నానాలు ఆచరించారు. పిండప్రదాన పూజలు చేశారు. పితృ దేవతలకు తర్పనాలు నిర్వహించారు. నదీమాతకు చీర, సారెను సమర్పించారు. ముత్తయిదువలు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు.
ట్రాఫిక్‌తో ఇబ్బందులు..
శుక్రవారం రాత్రి గాలి దుమారం, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం రెండు గంటలపాటు దంచి కొట్టింది. దీంతో కాళేశ్వరంలోని పుష్కరాల ఫ్లెక్సీ బోర్డులు, భారీ హోర్డింగ్‌లు నేలమట్టమయ్యాయి. సరస్వతి ఘాట్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లు, చలువ పందిళ్లు, డార్మెటరీ హౌస్ టెంట్లు కూలిపోయాయి. 120 ఎకరాల నల్లరేగడి భూముల్లో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలు బురదగా మారి వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఇప్పలబోరు, బస్టాండ్ సమీపంలో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. మంత్రి శ్రీధర్‌బాబు పరిస్థితులను పర్యవేక్షించి వెంటనే అధికారులతో మరమ్మతులు చేయించారు.
శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామికి పూజలు..
తెల్లవారుజామునుంచి భారీగా భక్తులు త్రివేణి సంగమంలోని సరస్వతి నదిలో పుష్కర స్నానాలు ఆచరించారు. శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయంలో క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. గంటల తరబడి నిలబడి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. శనివారం ఒక్కరోజు లక్షన్నర మంది వరకు భక్తులు పుష్కర స్నానాలు చేసి, దర్శనాలు చేసుకున్నట్లు అంచనా. క్యూలైన్‌లో మంచిర్యాలకు చెందిన భక్తుడు సొమ్మసిల్లిపోయాడు. అతడిని అక్కడే ఉన్న వ్యక్తులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.
– పుష్కరాల మరిన్ని వార్తలు,
ఫొటోలు 8, 9లోu
ప్రముఖుల పూజలు..
పుష్కరాలకు ప్రముఖుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శుక్రవారమే పుష్కరస్నానం ఆచరించగా శనివారం పితృదేవతలకు పిండప్రదానం చేశారు. అదేవిధంగా రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్, తుని తపోవనం పీఠాధిపతి సచ్చిదానందసరస్వతిస్వామి పుష్కర స్నానాలు చేశారు. స్వామివారి ఆలయంలో అభిషేకాలు, పూజలు చేశారు.