
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
మొగుళ్లపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి ముద్దమల్ల రాజేందర్ అన్నారు. శుక్రవారం మండలంలోని పిడిసిల్ల పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు మహ్మద్ సాధిక్ ఆధ్వర్యంలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రతి సబ్జెక్టులో తగిన అర్హతలతో మంచి అనుభవం గల ఉపాధ్యాయులతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బోధన అందిస్తున్నామన్నారు. రానున్న విద్యా సంవత్సరంలో ఏఐ (కృత్రిమ మేధ)తో కూడా విద్యాబోధన అందించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విశాలమైన తరగతి గదులు, ఆటస్థలం, మధ్యాహ్న భోజన పథకంలో పౌష్టికాహారం, ఉదయం రాగి జావ, ఉచిత పాఠ్యపుస్తకాలు, రాత పుస్తకాలు, రెండు జతల ఏకరూప దుస్తులు, 10వ తరగతి విద్యార్థులకు ప్రణాళిక ప్రకారం ప్రత్యేక తరగతుల బోధన, ఆ సమయంలో విద్యార్థులకు స్నాక్స్ కూడా అందిస్తున్నామన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు విశాలమైన ఆటస్థలంలో వారి ఆసక్తికి అనుగుణంగా వ్యాయామ ఉపాధ్యాయులతో వివిధ రకాల ఆటలు ఆడిస్తూ వారి మానసిక, శారీరక పెరుగుదలకు కృషి చేస్తున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎండీ సాధిక్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోటేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి లింగాల కుమారస్వామి, జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి సామల రమేష్, జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ దుప్పటి రాజగోపాల్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షురాలు శోభ, అంగన్‌వాడీ సిబ్బంది, తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
డీఈఓ రాజేందర్