
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
భూపాలపల్లి: పోలీసు అధికారులు, సిబ్బంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఎస్పీ కిరణ్ ఖరే సూచించారు. హైదరాబాద్ యశోద హాస్పిటల్ సౌజన్యంతో గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు మెగా వైద్యశిబిరం నిర్వహించారు. ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ.. పోలీసులు రాత్రింబవళ్లు పనిచేయడంతో పాటు, ప్రతీరోజు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటూ అధిక ఒత్తిడికి లోనవుతారని అన్నారు. ఫలితంగా ఆరోగ్య సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 650 మంది పోలీసు అధికారులు, సిబ్బంది, పోలీసుల కుటుంబసభ్యులకు కార్డియాలజీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, ఆప్తమాలజీతో పాటు పలు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని గుర్తించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బోనాల కిషన్, ఏఆర్ అదనపు ఎస్పీ వేముల శ్రీనివాస్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, సీఐలు డి.నరేష్‌కుమార్, మల్లేష్, యశోద ఆస్పత్రి వైద్యులు పాల్గొన్నారు.
ఎస్పీ కిరణ్ ఖరే