డిగ్రీ పరీక్షలపై అయోమయం | - | Sakshi
Sakshi News home page

డిగ్రీ పరీక్షలపై అయోమయం

May 7 2025 12:42 AM | Updated on May 7 2025 12:42 AM

డిగ్ర

డిగ్రీ పరీక్షలపై అయోమయం

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల పరిధిలో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ ఒకేషనల్‌, బీసీఏ తదితర కోర్సులకు సంబంధించి 2, 4,6 సెమిస్టర్లు, బ్యాక్‌లాగ్‌ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ల పరీక్షలు ఈ నెల 14వ తేదీనుంచి నిర్వహిస్తామని పరీక్షల విభాగం అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 6వ తేదీ వరకు పరీక్ష ఫీజులు చెల్లించేందుకు గడువు విధించారు. అయినప్పటికీ ఎక్కువశాతం ప్రైవేట్‌ కాలేజీలు పరీక్షల విభాగానికి చెల్లించలేదు. దీంతో పరీక్షల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. అధికారులు మాత్రం ఫీజులు చెల్లించిన కళాశాలల విద్యార్థులకు మాత్రం ఈనెల 14నుంచి పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేస్తున్నారు.

ఇప్పటివరకు 107 కాలేజీలు ఫీజుల చెల్లింపు..

కేయూ పరిధిలోని మూడు ఉమ్మడి జిల్లాల్లో ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌, అటానమస్‌, గురుకులాలు కలిపి 292 డిగ్రీకాలేజీలు ఉన్నాయి. అందులో 217 ప్రైవేటు డిగ్రీ కాలేజీలున్నాయి. డిగ్రీ సెమిస్టర్ల పరీక్షల నిర్వహణకు రెండు సార్లు టైంటేబుల్‌ను ప్రకటించి ఫీజులు చెల్లించాలని కోరారు. ఎక్కువశాతం ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీలు తమకు ప్రభుత్వంనుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాలేదని, అందువల్ల పరీక్షల నిర్వహణకు సహకరించబోమని బహిష్కరించారు. దీంతో యూనివర్సిటీ అధికారులు రెండు సార్లు పరీక్షలు వాయిదా వేశారు. అయినా చాలా కాలేజీలు ముందుకు రాకపోవటంతో ఈనెల 4న కాకతీయ యూనివర్సిటీ అధికారులు ఏయే ప్రైవేట్‌ కాలేజీలు ఇప్పటివరకు పరీక్షల ఫీజులు చెల్లించలేదో గుర్తించారు.

సెమిస్టర్ల పరీక్షలు జరిగేనా ?

తప్పనిసరిగా పరీక్షలు నిర్వహిస్తామని యూనివర్సిటీ అధికారులు చెబుతున్నప్పటికీ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువశాతం ప్రైవేట్‌ కాలేజీలు ఫీజులు చెల్లించలేదు. దీంతో వారు పరీక్షలు నిర్వహిస్తారా లేదా అనేది సందిగ్ధం నెలకొంది. ప్రధానంగా డిగ్రీ ఫైనలియర్‌ విద్యార్థులకు ఆరవ సెమిస్టర్‌ కీలకమైంది. ఈ పరీక్షలు జరగకుంటే వారు ఉన్నత చదువులు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం వారు టీజీ ఐసెట్‌, ఎడ్‌సెట్‌, లాసెట్‌, పీజీసెట్‌లకు ప్రిపేరవుతున్నారు. ఆ పరీక్షలు కూడా సమీపిస్తున్నాయి. ఎలాగైనా పరీక్షలు నిర్వహించాలనే డిమాండ్‌ విద్యార్థులనుంచి వినిపిస్తోంది. డిగ్రీ వివిధ సెమిస్టర్ల పరీక్షలకు సుమారు 1.70లక్షలమందికిపైగా విద్యార్థులు నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఫీజు రీయింబర్స్‌మెంటు చెల్లించేందుకు ముందుకు రాకపోవడంపై కూడా విమర్శలొస్తున్నాయి. ఫీజులు చెల్లించిన కాలేజీలకే పరీక్షలు నిర్వహిస్తే, చెల్లించని కాలేజీల విద్యార్థుల పరిస్థితి ఏమిటనే చర్చ నడుస్తోంది.

ఫీజులు చెల్లించిన కాలేజీల విద్యార్థులకే పరీక్షలు

కేయూ పరిధిలో విద్యార్థులనుంచి ఫీజులు వసూలు చేసి కూడా ఫీజు రీయింబర్స్‌మెంటు రాలేదని ఎక్కువశాతం ప్రైవేట్‌ కాలేజీలు ఫీజులు చెల్లించడం లేదు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా వేశాం. వారికి సమయం కూడా ఇచ్చాం. విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఇప్పటివరకు ఫీజులు చెల్లించిన అన్ని యాజమాన్యాల కాలేజీల్లో ఈ నెల14నుంచి తప్పనిసరిగా పరీక్షలు నిర్వహిస్తాం. రెండు, మూడు రోజుల్లో హాల్‌టికెట్లు జారీ చేస్తాం. ఇప్పటికై నా ఫీజులు చెల్లించని కాలేజీలు ఒకటి, రెండు రోజుల్లోనైనా ఫీజులు చెల్లించి నామినల్‌రోల్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది.

– కె.రాజేందర్‌, పరీక్షల నియంత్రణాధికారి

ఇటీవల దోస్త్‌ నోటిఫికేషన్‌..

2025–2026 విద్యాసంవత్సరంలో డిగ్రీ ప్రవేశాలకు దోస్త్‌కు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇటీవల నోటిఫికేషన్‌ జారీచేసింది. కేయూ అధికారులు పరీక్షల ఫీజులు చెల్లించని 138 ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీల పేర్లను దోస్త్‌నుంచి తొలగించారు. దీంతో ఆయా కాలేజీల్లో అడ్మిషన్లకు ఆప్షన్లు ఎంచుకునే అవకాశం లేదు. దీంతోనైనా పరీక్ష ఫీజులు చెల్లించేందుకు యాజమాన్యాలు ముందుకువస్తాయని భావించారు. మంగళవారం పరీక్ష ఫీజు గడువు ముగిసే వరకు 138 కాలేజీల్లో 4 కాలేజీలు మాత్రమే చెల్లించాయి. మొత్తంగా అన్ని యాజమాన్యాలు కలిపి మంగళవారం వరకు 107కాలేజీలు ఫీజులు చెల్లించాయి.

ఫీజులు చెల్లించని 138 కళాశాలలను దోస్త్‌నుంచి తొలగింపు

వీటిలో ఎక్కువశాతం ప్రైవేట్‌ కాలేజీలే..

ఇప్పటికే రెండు సార్లు

పరీక్షలు వాయిదా

ముగిసిన ఫీజు చెల్లింపు గడువు

ఫీజులు చెల్లించిన కాలేజీల విద్యార్థులకే పరీక్షలు

మిగతా విద్యార్థుల పరిస్థితి ఏమిటీ?

డిగ్రీ పరీక్షలపై అయోమయం1
1/1

డిగ్రీ పరీక్షలపై అయోమయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement