
పేదల కోసమే సన్నబియ్యం పంపిణీ
భూపాలపల్లి రూరల్: పేదోడి కడుపు నింపేందుకే రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిందని మహిళా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలో ఆమె పర్యటించారు. పట్టణంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. కార్డుదారులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం శాంతినగర్ కాలనీలో పేద దళితుల ఇంట్లో కాలనీవాసులతో కలిసి సన్నబియ్యంతో వండిన భోజనాన్ని తిన్నారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అంతకు ముందు అసోం ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అసోం ముఖ్యమంత్రి మహిళలకు క్షమాపణలు చెప్పాలని.. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేవిధంగా కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, జిల్లా ఇన్‌చార్జ్ కుమారి, స్టేట్ సెక్రటరీ హారిక, జిల్లా వైస్ ప్రెసిడెంట్‌లు సుగుణ, జ్యోతిరెడ్డి పాల్గొన్నారు.
మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు