కాటారం: కాటారం, మహదేవపూర్ అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్న పులి కదలికలపై బుధవారం జిల్లా అటవీశాఖ అధికారి నవీన్‌రెడ్డి ఆరా తీశారు. కాటారం మండలం గుండ్రాత్‌పల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలోని వాగులు, అడవి దారుల వెంట పులి పాదముద్రలను డీఎఫ్‌ఓ పరిశీలించారు. పులి గుండ్రాత్‌పల్లి మీదుగా అన్నారం, పల్గుల అటవీ ప్రాంతం నుంచి గోదావరి దాటి చెన్నూర్ అటవీ ప్రాంతంలోకి వెళ్లిందని అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే పూర్తి స్థాయి నిర్ధారణకు డీఎఫ్‌ఓ అటవీ ప్రాంతాన్ని పరిశీలించడానికి వచ్చినట్లు సమాచారం. డీఎఫ్‌ఓ వెంట కాటారం రేంజర్ స్వాతి, సెక్షన్, బీట్ అధికారులు ఉన్నారు.
కొత్తపల్లిగోరిలో పులి సంచారం?
రేగొండ: కొత్తపల్లిగోరి మండలకేంద్రంలో పులి సంచారం కలకలం రేపింది. మంగళవారం సాయంత్రం పల్లెబోయిన రమేశ్ అనే రైతుకు చెందిన పొలం గట్టు మీదుగా బొక్కి చెరువు వైపు వెళ్తుండగా ఓ మహిళ వీడియో తీసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఈ ఘటనపై చెల్పూర్ ఇన్‌చార్జ్ రేంజ్ ఆఫీసర్ నరేష్‌ను వివరణ కోరగా.. కొత్తపల్లిగోరిలో పులి సంచరిస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. నిజానిర్ధారణ కోసం నేడు పాదముద్రలు సేకరిస్తామన్నారు.