పరిహారం అందేనా? | - | Sakshi
Sakshi News home page

పరిహారం అందేనా?

Mar 5 2025 1:24 AM | Updated on Mar 5 2025 1:21 AM

గోవిందరావుపేట: చల్వాయిలోని తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ (టీజీఎస్పీ) 5వ బెటాలియన్‌ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు 10 ఏండ్లు గడిచినా నేటికీ పరిహారం అందలేదు. తెలంగాణ ప్రభుత్వం బెటాలియన్‌ నిర్మాణానికి 105 ఎకరాలు లాక్కొని పరిహారం కూడా చెల్లించకుండా సుమారు 60 మంది కుటుంబాలను రోడ్డున పడేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములు కోల్పోయిన రైతులు సుమారు ఐదు సంవత్సరాలపాటు ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేశారు. బెటాలియన్‌ గేటు ఎదుట రిలే నిరాహార దీక్షలు సైతం కొనసాగించినా ఫలితం లేకుండా పోయింది. ఇలా పోరాటం చేసిన పలువురు రైతులపై పోలీసు కేసులు నమోదు కావడంతో జైలుకు సైతం వెళ్లారు. నేటికీ కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

ఆత్మహత్యాయత్నం..

బెటాలియన్‌ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులు తమకు న్యాయం చేయాలని అధికారులు, ప్రభుత్వం, నాయకులను కోరినా.. ఫలితం లేకుండా పోయింది. దీంతో వివిధ రూపాల్లో ఆందోళనలు చేశారు. చివరకు చల్వాయి గ్రామ పంచాయతీ ఆవరణలో ఉన్న వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో మహిళా రైతులు సైతం ఉండడం గమనార్హం. దీంతో అప్పటి అధికారులు, పోలీసులు న్యాయం చేస్తామని నచ్చజెప్పడంతో రైతులు తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.

లబ్ధికోసమే రాజకీయ నాయకుల మద్దతు ?

భూ నిర్వాసితులు చేపట్టిన ధర్నాలు, రాస్తారోకోలు, రిలే నిరాహార దీక్షలకు పలువురు రాజకీయ నాయకులు మద్ధతు ప్రకటించినా.. అది కేవలం వారి రాజకీయ లబ్ధికోసమేనని రైతులు ఆరోపిస్తున్నారు. రాజకీయ నాయకులు నిజంగా తమ కోసం పోరాడితే ఎప్పుడో న్యాయం జరిగేదని రైతులు పేర్కొంటున్నారు. ప్రధాన పార్టీలోని నాయకులు సీతక్క, ప్రొఫెసర్‌ కోదండరాం, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ వంటి వారు.. రైతులకు పరిహారం వచ్చేవరకు అండగా ఉంటామని చెప్పి మాయమాటలతో పబ్బం గడిపారని, కేసుల పాలై కోర్టు చుట్టూ తిరుగుతున్నా.. ప్రస్తుతం పట్టించుకునేవారే లేరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రాణం కోల్పోయిన చిలుకమ్మ

వారసత్వంగా వచ్చిన భూమిని నమ్ముకుని 60 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటూ నలుగురు పిల్లలకి పెళ్లి చేసి వారి పిల్లలతో గడిపే సమయంలో భూమిని ప్రభుత్వం తీసుకుందని తెలిసి గుండెపోటుతో మృతిచెందింది. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది.

హామీ ఇచ్చి మోసం చేశారు..

మా తాతల నాటినుంచి వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాం. ఉన్న పలంగా వచ్చి ఇది ప్రభుత్వ భూమి, ఇక్కడ బెటాలియన్‌ నిర్మాణం చేపడుతున్నాం.. అని భూమిని లాక్కొని, మా మీద కేసులు నమోదు చేసి జైలుకి పంపారు. ఉద్యోగం కల్పిస్తాం.. భూమికి బదులు భూమిస్తాం.. అని మోసం చేశారు. ఇప్పటికై నా భూములు కోల్పోయిన రైతులకు హామీ మేరకు పరిహారం ఇవ్వాలి. రైతులపై ఉన్న కేసులను ఎత్తేయాలి.

– జంపాల అనిల్‌, భూ నిర్వాసితుడు

కేసు కోర్టులో ఉంది

చల్వాయి బెటాలియన్‌ కింద భూములు కోల్పోయిన రైతుల కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. కోర్టు ఉత్తర్వుల మేరకు మేము ముందుకు వెళ్తాం.

– సృజన్‌ కుమార్‌,

తహసీల్దార్‌, గోవిందరావుపేట

ఆందోళనలో టీజీఎస్పీ 5వ బెటాలియన్‌ భూనిర్వాసితులు

చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ

పదేళ్లు గడిచినా తప్పని

ఎదురుచూపు

పరిహారం అందేనా?1
1/3

పరిహారం అందేనా?

పరిహారం అందేనా?2
2/3

పరిహారం అందేనా?

పరిహారం అందేనా?3
3/3

పరిహారం అందేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement