● ఎల్‌డీఎం జయప్రకాశ్
ఏటూరునాగారం: మహిళలు పొదుపుపై దృష్టి సారించి ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎల్‌డీఎం జయప్రకాశ్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారిత విభాగం ఆధ్వర్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచే ప్రవేశపెట్టిన ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా ఎస్‌బీఐ బ్యాంక్ వారి సహకారంతో మహిళలకు అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ఈట రేణుక అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా ఎల్‌డీఎం జయప్రకాశ్ హాజరై మాట్లాడారు. మహిళలు ఆర్థిక క్రమశిక్షణ పాటించినప్పుడు కుటుంబం, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. పొదుపు చేయడంలో మెలకువలను పాటించాలన్నారు. మొబైల్ ఫోన్‌లకు వచ్చే లింక్‌లు, ఇతర విషయాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పాతిమా, నవీన్, వెంకటయ్య, జ్యోతి, సంపత్, రమేష్ పాల్గొన్నారు.