
కనిపించని ఫాగింగ్
కాళేశ్వరం: జిల్లావ్యాప్తంగా గ్రామపంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన పడకేసింది. పంచాయతీల్లో సర్పంచుల పదవీ కాలం ముగిసి నాలుగు నెలలు గడుస్తోంది. దీంతో పారిశుద్ధ్య చర్యలు చేయడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. లార్వా దశలోనే చేయాల్సిన యాంటీలార్వా ఆపరేషన్ చర్యలు పంచాయతీల్లో కనిపించడం లేదు. ఇప్పటికే వర్షాకాలం వచ్చేసింది. తొలకరి వర్షాలు కురిశాయి. దీంతో దోమలు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. వారానికి ఒకసారి చేపట్టాల్సిన ఫాగింగ్‌పై అధికారులు దృష్టిసారించడం లేదు.
జిల్లాలో ఇలా..
జిల్లాలో మొత్తం 11 మండలాల్లో 241 గ్రామపంచాయతీలు ఉన్నాయి. మొత్తం 174 ఫాగింగ్ మిషన్లు ఉండగా.. ప్రస్తుతం 124 మాత్రమే పనిచేస్తున్నాయి. మిగతా ఫాగింగ్ మిషన్లకు మరమ్మతులు చేయాల్సి ఉంది. మరికొన్ని పంచాయతీల్లో కొనుగోలు చేయాల్సి ఉంది. వర్షాకాలం వచ్చినా ఫాగింగ్ మిషన్లకు మరమ్మతులు చేయించేందుకు పంచాయతీ సిబ్బంది మీనమేషాలు లెక్కిస్తున్నారు. పనిచేస్తున్న వాటిని మూలనపడేసి పనిచెప్పటం లేదు.
నిండిన డ్రెయినేజీలు..
మరోవైపు పల్లెల్లో డ్రెయినేజీలు పూడికతీయక నిండి మురుగునీరు పారే పరిస్థితి లేదు. చెత్తాచెదారం పేరుకుపోయి పరిసరాలు దుర్గంధభరితంగా తయారవుతున్నాయి. దీంతో ప్రమాదకరమైన డెంగీ, మలేరియా, టైఫాయిడ్ కారక దోమల వ్యాప్తికి కారణభూతమవుతున్నాయి. డ్రెయినేజీల్లో పూడిక తీయిస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో ఆచరణ సాధ్యం కావడం లేదని ఆరోపణలు ఉన్నాయి.
ప్రత్యేకాధికారుల పర్యవేక్షణేది..
జిల్లాలో ప్రత్యేకాధికారులు మాత్రం ఆయా గ్రామాలను సందర్శించడం లేదు. వారికున్న పని ఒత్తిడితో పంచాయతీల బాగోగులు కార్యదర్శులపై వదిలేశారు. కార్యదర్శులు మాత్రం వారానికి రెండు సార్లు విధుల్లోకి వస్తూ పారిశుద్ధ్యంపై శ్రద్ధ చూపడం లేదని విమర్శలు ఉన్నాయి. దీంతో పారిశుద్ధ్య లోపంతో సీజనల్ వ్యాధులు ప్రబలనున్నాయి. దోమలు వ్యాప్తి చెందకుండా ల్వార దశలోనే తగిన చర్యలు తీసుకుంటే ఆదిలో అంతమొందించవచ్చని ప్రజలు కోరుతున్నారు.
నిధుల లేమి..
కొన్ని గ్రామపంచాయతీల్లో మాత్రం బ్లీచింగ్ చేయించక నెలలు గడుస్తుంది. పంచాయతీల ఖజానాల్లో నిధులు లేకపోవడంతో పొదుపుగా వాడుతున్నామంటూ పంచాయతీ కార్యదర్శుల ద్వారా తెలిసింది. వానలు తీవ్రమైతే పారిశుద్ధ్యం లోపించి దోమల వ్యాప్తి అధికమవుతుంది. చెత్తాచెదారం పేరుకుపోయి దోమలు వ్యాప్తి చెందుతాయి. ఈ లోపే జిల్లా అధికారులు పరిస్థితులను గాడినపెట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.
ఫాగింగ్ మిషన్లు
బాగుచేయిస్తాం..
ఇప్పటికీ ఎండలు మండుతున్నాయి. వర్షాలు పడటం లేదు. వర్షాకాలం నేపథ్యంలో ఫాగింగ్ యంత్రాలను బాగు చేయిస్తున్నాం. జిల్లాలో 174 వరకు ఫాగింగ్ మిషన్లు ఉన్నాయి. అందులో కొన్నింటికి మరమ్మతులు చేయిస్తున్నాం. ప్రస్తుతం డ్రెయినేజీల్లో పూడికతీత, నీళ్లు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి దోమలు విజృంభించకుండా చర్యలు తీసుకుంటున్నాం. వర్షాలు ముసురు పడితే ఫాగింగ్ చేయడానికి చర్యలు తీసుకుంటాం.
– నారాయణరావు, జిల్లా పంచాయతీ అధికారి
లార్వా దశలోనే దోమలను అంతమొందిస్తే మేలు
సైడ్ డ్రెయినేజీల్లో
పూడికతీతలో జాప్యం
పడకేసిన ప్రత్యేకాధికారుల పాలన..
సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం

కనిపించని ఫాగింగ్