పేదలకు అండగా ప్రభుత్వం

లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి  - Sakshi

భూపాలపల్లి: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తూ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌. సీఎం సహాయ నిధి కింద భూపాలపల్లి మండలానికి మంజూరైన రూ.1.10 కోట్ల విలువైన చెక్కులను గురువారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ.. రాష్ట్రంపై కేంద్రం అవలంభిస్తున్న మొండివైఖరిని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించినందునే ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బుర్ర రమేష్‌, మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణి, వైస్‌చైర్మన్‌ కొత్త హరిబాబు, ఎంపీపీ మందల లావణ్య, బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్‌, కౌన్సిలర్‌ నూనె రాజు, నాయకులు పాల్గొన్నారు.

నీటి ఎద్దడి లేకుండా చర్యలు

భూపాలపల్లి రూరల్‌: వేసవి సమీపిస్తున్న దృష్ట్యా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ భూపాలపల్లి మండలంలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం జెడ్పీ సమావేశ మందిరంలో ఎంపీపీ లావణ్య అధ్యక్షతన మండల ప్రజా పరిషత్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ గ్రామాల్లో భగీరథ నీటితో పాటు గతంలో ఉన్న బోర్లు, తదితర నీటి సౌకర్యానికి సంబంధించిన చేతిబోర్లను కూడా వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ఉపాధి పనులను గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారం చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. యాసంగి సాగుకు నిరంతరం విద్యుత్‌ అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మహిళా ప్రజాప్రతినిధులను, అధికారులను సన్మానించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ అనిల్‌కుమార్‌ సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

అధికారుల నిలదీత

వ్యవసాయం, ఉద్యానవనం, వైద్యఆరోగ్యం, విద్యుత్‌, మిషన్‌ భగీరథ, ఐకేపీ సంఘాలు, తదితర శాఖల ద్వారా మండలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రగతిని సంబంధిత శాఖల అధికారులు సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మిషన్‌ భగీరథ, విద్యుత్‌ సమస్యలు, ఉపాధి హామీ పనుల పెండింగ్‌ బిల్లులపై సంబంధిత అధికారులను నిలదీశారు. 2019లో చేపట్టిన ఇంకుడు గుంతల బిల్లులు ఇప్పటివరకు రాలేదని అధికారులు దాటవేస్తూ వస్తున్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

Read latest Jayashankar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top