పకడ్బందీ ఏర్పాట్లు చేశాం..
జనగామ: రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నిర్వహించనున్న పాలిసెట్–2026 ప్రవేశ పరీక్షకు జిల్లాలో సర్వం సిద్ధం చేశారు. ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం ప్రతీ సంవత్సరం నిర్వహించే ఈ పరీక్షకు భారీ సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేయడంతో జిల్లాలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని పరీక్ష కేంద్రాల్లో పర్యవేక్షణ బృందాలు, అవసరమైన సిబ్బందిని నియమించారు.
జిల్లాలో ఈ సంవత్సరం 1,615 మంది విద్యార్థులు పాలిసెట్‌కు హాజరుకానున్నారు. వీరి కోసం అధికారులు ఆరు కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టణంలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు సెంటర్లు(ఏ,బీ) ఏర్పాటు చేయగా, ఇక్కడ ఒక్కో కేంద్రంలో 300 మంది చొప్పున మొత్తం 600 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. జనగామ మండలంలోని యశ్వంతాపూర్ క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో సైతం మరో రెండు సెంటర్లు (ఏ,బీ) ఏర్పాటు చేశారు. సెంటర్– ఏలో 288 మంది, సెంటర్– బీలో 260 మంది విద్యార్థులను కేటాయించారు. స్టేషన్ ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ సెంటర్‌లో 300 మంది, ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్‌లో 167 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాబోతున్నారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో తాగునీరు, టెంట్లు, వైద్య సదుపాయం, భద్రతా ఏర్పాట్లు కల్పించడంతో పాటు సీసీ కెమెరాలతో పోలీసులు పకడ్బందీ పర్యవేక్షణ చేయనున్నారు.
పరీక్ష ఉదయం 11 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1.30 గంటలకు ముగుస్తుంది. విద్యార్థులు ఉదయం 10 గంటల కల్లా గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 11 గంటల తర్వాత గేట్లు క్లోజ్ చేసి నిమిషం ఆలస్యమైనా ఎవరినీ లోపలికి అనుమతించరు. పరీక్షకు సంబంధించి విద్యార్థులు హాల్‌టికెట్‌తో పాటు హెచ్‌బీ బ్లాక్ పెన్సిల్, బ్లూ లేదా బ్లాక్ బాల్‌పెన్ తప్పనిసరిగా తీసుకురావాలి. మొబైల్ ఫోన్లు, కాలిక్యులేటర్లు, స్మార్ట్ డివైస్‌లు పూర్తిగా నిషేధమని అధికారులు వెల్లడించారు.
జిల్లా విద్యాశాఖ, పోలీసు శాఖ కలిసి ప్రత్యేక బృందాలను మోహరించనున్నారు. ట్రాఫిక్ నియంత్రణ నుంచి పరీక్ష కేంద్రాల వద్ద శాంతిభద్రతల వరకు అన్ని చర్యలు చేపట్టనున్నారు. విద్యార్థుల కోసం హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి సందేహాలు నివృత్తి చేయనున్నారు. పాలిసెట్–2026 ఎంట్రెన్స్‌ను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
హాల్ టికెట్‌పై విద్యార్థి ఫొటో ముద్రణ జరగకుండా వచ్చినట్‌లైతే పాస్‌ఫొటోతో పాటు గుర్తింపుగా ఆధార్ కార్డును తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచనలు చేశారు.
జిల్లాలో సెంటర్ల వారీగా వివరాలు:
6 సెంటర్లు..హాజరుకానున్న 1,615 మంది విద్యార్థులు
ఉదయం 11 గంటలకు గేట్లు మూసివేత
నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు
ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సిద్దిపేట రోడ్డు:
(సెంటర్– ఏ): 300మంది
ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సిద్దిపేట రోడ్డు:
(సెంటర్– బీ): 300మంది
క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాల(సీజేఐటీ),
యశ్వంతాపూర్(సెంటర్– ఏ): 288మంది
క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాల(సీజేఐటీ),
యశ్వంతాపూర్ (సెంటర్– బీ): 260మంది
ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్,
స్టేషన్ ఘన్‌పూర్: 300మంది
ప్రభుత్వ జూనియర్ కళాశాల,
స్టేషన్ ఘన్‌పూర్: 167మంది
పాలిసెట్–2026 కోసం జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశాం. 1,615 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. పరీక్ష 11 గంటలకు ప్రారంభమవుతుంది. విద్యార్థులను ఉదయం 10 గంటల నుంచి లోపలికి అనుమతిస్తాం. సరిగ్గా 11 గంటలకు గేట్లు క్లోజ్ చేసిన తర్వాత, ఎవరినీ కూడా లోనికి అనుమతించం.
–శ్రీనివాస్, డిస్ట్రిక్ కో ఆర్డినేటర్,
ఏబీవీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్


