కొనుగోళ్లపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు | - | Sakshi
Sakshi News home page

కొనుగోళ్లపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

May 13 2026 1:20 AM | Updated on May 13 2026 1:20 AM

వీసీలో సీఎం రేవంత్‌రెడ్డి

జనగామ: ధాన్యం, మక్కల కొనుగోళ్లలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. వీసీ అనంతరం సంబంధిత అధికారులతో కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా మాట్లాడారు.. ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలను తప్పకుండా పాటిస్తూ, ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి సమస్యలు రాకుండా, రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రతీ అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. టోకెన్‌ పద్ధతి ప్రకారం తేమ శాతం రాగానే కొనుగోళ్లు చేపట్టి, అదే రోజూ ట్యాగ్‌ చేసిన మిల్లులకు ధాన్యాన్ని తరలించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ బెన్‌ షాలోమ్‌, జెడ్పీ సీఈఓ, ఇన్‌చార్జ్‌ డీఆర్డీఓ రంగారావు, పౌర సరఫరాల సంస్థ డీఎం హతీరాం, సహకార శాఖ అధికారి కోదండరాములు, జిల్లా మార్కెటింగ్‌ అధికారి రామకృష్ణ, ఇన్‌చార్జ్‌ డీసీఎస్‌ఓ సురేష్‌ రెడ్డి, ఏపీడీ నూరొద్దీన్‌, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్‌గౌడ్‌, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

పామాయిల్‌ తోటలో అగ్నిప్రమాదం

రఘునాథపల్లి: మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ వెనకాల మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో పది ఎకరాల పామాయిల్‌ తోటలు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో డ్రిప్‌ పరికరాలు కూడా కాలిపోయాయి. హన్మకొండకు చెందిన అరుకొండ శ్రీధర్‌ మూడేళ్ల క్రితం ఏడున్నర ఎకరాల్లో పామాయిల్‌ తోట సాగు చేశారు. తోట కాపునకు వచ్చే తరుణంలో అటు వైపు వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు బీడి తాగి ఆర్పకుండా విసరడంతో తోటలోని గడ్డికి మంటలు అంటుకున్నాయి. మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా తోట చుట్టూ పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. అదే విధంగా పక్కనే ఉన్న హన్మకొండకు చెందిన వెంకటేశ్వర్లు, ప్రభాకర్‌కు చెందిన మూడు ఎకరాల పామాయిల్‌ తోటలకు కూడా మంటలు అంటుకున్నాయి. ముగ్గురికి చెందిన పది ఎకరాల్లో డ్రిప్‌ పరికరాలు కాలిపోయాయి. మంటలను గుర్తించిన పోలీసులు వెంటనే స్థానికుల సహకారంతో పచ్చని చెట్ల కొమ్మలతో శ్రమించి మంటలను ఆర్పారు. అప్పటికే పామాయిల్‌ తోటలు దగ్ధమై రైతులకు తీవ్ర నష్టం జరిగినట్లు సమాచారం.

‘బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలి’

జనగామ రూరల్‌: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమారుడు భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని ప్రజాత్రంత మహిళా సంఘం, డీవైఎఫ్‌ఐ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్‌ వద్ద మంగళవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి ఇర్రి అహల్య, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బోడ నరేందర్‌ మాట్లాడుతూ.. మైనర్‌ బాలికపై అత్యాచారం చేసిన బండి భగీరథ్‌పై పోక్సో కేసు పెట్టి నాలుగు రోజులైనా ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడం దారుణమన్నారు. దీనిపై బీజేపీ మహిళా మోర్చా నాయకురాళ్లు స్పందించాలన్నారు. డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ధర్మభిక్షం, ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి మోకు భవాని, ఎర్ర అనిత, కొండ వరలక్ష్మి, మమత, కనకచారి, విప్లవ, సాత్విక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నైపుణ్యాలు పెంచుకోవాలి

కేయూ క్యాంపస్‌: పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలు పెంచుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ వి.బాలకిష్టారెడ్డి అన్నారు. మంగళవారం కేయూలోని కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ సెమినార్‌ హాల్‌లో ప్లేస్‌మెంట్‌ సెల్‌, మేజిక్‌ బస్‌ ఫౌండేషన్‌ సంయుక్తంగా నిర్వహించిన జాబ్‌ మేళాలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచం మొత్తం భారత్‌వైపు చూస్తోందన్నారు. కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా విద్యార్థులు ప్రత్యేక నైపుణ్యాలు పెంపొందించుకోవాలన్నారు. కేయూ ప్లేస్‌మెంట్‌ సెల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ చిర్రరాజు మాట్లాడారు. ఈజాబ్‌ మేళాలో 12 ప్రముఖ సంస్థలు పాల్గొనగా విద్యార్థులు హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement